ఫోన్లో అనేవి ఇప్పుడు వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి మాత్రమే ఫోన్లన్నీ కనిపెట్టారు. కానీ ఇప్పుడు అవే మన జీవితాన్ని ఆక్రమించేసాయి. ఎక్కువ కాలం మనం ఫోన్లో చూస్తూనే మాట్లాడుతూనే కనిపిస్తున్నాము. స్మార్ట్ ఫోన్ అనేది ఒక వ్యసనంలా మారిపోయింది. రాత్రిపూట ఫోన్‌లో సినిమాలు, పాటలు, సీరియల్స్ చూసుకున్నాక ఆ ఫోన్లో దిండు పక్కన పెట్టుకొని నిద్రపోయే వారు కూడా ఎంతోమంది. ఇలా చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి.
రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్
మొబైల్ ఫోన్లో సిగ్నల్స్ ప్రసారం చేయడానికి రేడియో తరంగాలను ఉపయోగిస్తాయి. స్మార్ట్ ఫోన్ల నుండి రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ విడుదల అవుతూ ఉంటుంది. ఇది సాధారణంగా తక్కువ మొత్తంలోనే ఉంటుంది. మనిషి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించకపోవచ్చు. కానీ స్మార్ట్ ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగిస్తే మాత్రం సమస్యలు తెచ్చుకున్న వారమే అవుతాము. రోజువారీ జీవితంలో కొన్ని గంటల పాటు రేడియేషన్ కి గురవడం అనేది ఎప్పటికీ మంచిది కాదు. ఇలాంటి గాడ్జెట్లను శరీరానికి దూరంగా ఉంచడం ఎంతో ముఖ్యం. రాత్రిపూట వీలైనంతగా మీ స్మార్ట్ ఫోన్లను ఫ్లైట్ మోడ్ లో పెట్టి మీ మంచానికి దూరంగా పెట్టేందుకు ప్రయత్నించండి.
నిద్రలేమి
నిద్ర అనేది మన శరీరానికి అతి ముఖ్యమైనది. ఇది శరీరం అలసట నుండి కోలుకోవడానికి సరికొత్తగా, ఉత్సాహంతో రోజును ప్రారంభించడానికి అవసరం పడుతుంది. అయితే ఫోన్‌ను దగ్గర పెట్టుకొని నిద్రపోవడం వల్ల శరీరానికి సరిపడినంత నిద్ర దొరకదు. అది నిద్రా నాణ్యతను తగ్గిస్తుంది. మొబైల్ నుంచి వచ్చే నీలిరంగు స్క్రీన్ నిద్ర నియంత్రించడానికి కారణమయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల మీకు సరిగా నిద్ర పట్టదు. అలాగే ఫోన్ నుంచి వచ్చే ఎస్ఎంఎస్ సౌండ్ లు కూడా మీ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఫోన్ వీలైనంతగా వైబ్రేషన్ మోడ్ లో పెట్టుకొని నిద్రపోవడం ఉత్తమం.
మీ మంచం పక్కనే ఫోన్ పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటే మీకు స్మార్ట్ ఫోన్ వాడకం అనేది వ్యసనంగా మారిందని గుర్తుంచుకోండి. రాత్రిపూట మెలకువ వచ్చినప్పుడు వెంటనే ఫోన్ కోసం వెతికి చూస్తున్నారు. అంటే మీరు ఆ ఫోన్ కు బానిస అయిపోయారు. ఇది మీ మానసిక ఆరోగ్యానికి ఎంతో హానికరం. స్మార్ట్ ఫోన్ వ్యసనం అనేది ఒత్తిడి, ఆందోళనను పెంచుతుందని శాస్త్రీయంగా ఎప్పుడో నిరూపణ జరిగింది. కాబట్టి వీలైనంతవరకు ఫోన్ ను ఎంత దూరంగా పెడితే అంత మంచిది.
స్మార్ట్ ఫోన్ అనేది నిత్యం మనతోనే ఉంటుంది. కాబట్టి దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫోన్ పైనే సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియాలు అది ఎక్కువగా చేరుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మిలియన్ల కొద్ది సూక్ష్మక్రిములను మోసే శక్తి ఫోన్ కి ఉంది. కాబట్టి ప్రతిరోజు దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఉంది.
ఫోన్ మీ జీవితంలో భాగం చేసుకోకండి. దానికి కేవలం ఒక వస్తువుగానే చూడండి. అవసరమైనప్పుడు మాత్రమే వాడండి. పూర్తిగా దానికి మీరు లొంగిపోతే మీ జీవితం మీ చేతుల్లో ఉండదు.