Kidney Diseases: మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలను బయటకు పంపే కీలక అవయవాలు కిడ్నీలు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం, తప్పుడు ఆహారపు అలవాట్లు, పెరిగిన ఒత్తిడి కారణంగా చాలా మంది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల బారిన పడుతున్నారు. మూత్రపిండాల సమస్యలు ప్రారంభంలో బయటపడవు. అందుకే వీటిని ‘సైలెంట్ కిల్లర్స్’ అంటారు. అయితే.. మన లైఫ్ స్టైల్ లో కొన్ని ప్రాథమిక మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడే.. 5 ముఖ్యమైన లైఫ్ స్టైల్ మార్పులు:
కిడ్నీలు ఒకసారి దెబ్బతింటే.. వాటిని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడం కష్టం. అందుకే “నివారణే మేలు” అనే సూత్రాన్ని పాటిస్తూ.. కింది 5 మార్పులను మీ జీవితంలో భాగంగా చేసుకోండి.
1. తగినంత నీరు తాగడం:
నీరు కిడ్నీలకు ఇంధనం వంటిది. తగినంత నీరు తాగడం వల్ల రక్తంలోని సోడియం, యూరియా, టాక్సిన్లు యూరిన్ ద్వారా సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కూడా కాపాడుతుంది. అయితే.. అతిగా నీరు తాగడం కూడా మంచిది కాదు. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తీసుకోవడం ఆరోగ్యకరం.
2. ఆరోగ్యకరమైన ఆహారం, ఉప్పు నియంత్రణ:
మనం తీసుకునే ఉప్పులో ఉండే సోడియం కిడ్నీలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అలాగే.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ తగ్గించి.. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల కిడ్నీలు పనితీరు మెరుగు పడుతుంది.
3. రక్తపోటు, చక్కెర స్థాయిల నియంత్రణ :
మధుమేహం, అధిక రక్తపోటు అనేవి మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారణాలు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే.. అవి కిడ్నీలోని రక్తనాళాలను దెబ్బతీస్తాయి. అలాగే.. అధిక బీపీ కిడ్నీ ఫిల్ట్రేషన్ వ్యవస్థపై ఒత్తిడి తెస్తుంది. కాబట్టి.. క్రమం తప్పకుండా వీటిని చెక్ చేసుకుంటూ అదుపులో ఉంచుకోవాలి.
Also Read: అన్నం అంటే ఇష్టమా? డయాబెటిస్ ఉన్నవారికి ఈ 5 ప్రత్యామ్నాయాలు బెస్ట్!
4. క్రమం తప్పకుండా వ్యాయామం :
శారీరక శ్రమ రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా శరీర బరువును నియంత్రిస్తుంది. అధిక బరువు లేదా ఊబకాయం మూత్రపిండాలపై అదనపు భారాన్ని మోపుతుంది. రోజుకు 30 నిమిషాల వాకింగ్, యోగా లేదా సైక్లింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
5. పెయిన్ కిల్లర్స్ వాడకాన్ని తగ్గించడం :
చాలా మంది తలనొప్పి లేదా ఒళ్లు నొప్పులు రాగానే డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఇవి కిడ్నీలు అత్యంత ప్రమాదకరం. క్రమం తప్పకుండా వీటిని వాడటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా మందు వాడే ముందు డాక్టర్లు సంప్రదించడం తప్పనిసరి.