Congress Infighting: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, బహిరంగ విమర్శలు ఇప్పటికీ తగ్గడం లేదు. అధికారం సాధించి ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా.. కొంతమంది ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి నాయకుల తీరు పార్టీ అధిష్ఠానానికి పెద్ద సవాలుగా మారింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ పీసీసీ నాయకత్వం నిత్యం హెచ్చరిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నా.. కొందరు నేతల తీరులో ఎలాంటి మార్పు కనిపించకపోవడం విశేషం. నిత్యం పత్రికల్లో, టీవీ మీడియాలో అధిష్ఠానానికి వ్యతిరేకంగా, ముఖ్య నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు ఇప్పుడు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.
మైక్‌లో మంచి.. చెవిలో చెడు
‘మంచిని మైక్‌లో చెప్పండి.. చెడును చెవిలో చెప్పండి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గడిచిన మూడేళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ నిబంధనలు, క్రమశిక్షణను ఉల్లంఘించవద్దని సూచిస్తూనే ఉన్నారు. పార్టీ ఇమేజ్ తోపాటు ప్రభుత్వ గౌరవం కాపాడటం అందరి బాధ్యత అంటూ పదే పదే గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, సంక్షేమ పథకాలను మైక్ ముందుకు వచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఒకవేళ పార్టీలో, ప్రభుత్వంలో ఏవైనా పొరపాట్లు , నేతల మధ్య విభేదాలు ఉంటే వాటిని అంతర్గత సమావేశాల్లో మాత్రమే ముఖ్య నేతల చెవిలో చెప్పాలని ఇటీవల టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా నొక్కి చెప్పారు. కానీ ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. పైగా ఎమ్మెల్యేలే బహిరంగ వ్యాఖ్యలకు దిగడం మరింత ఆందోళన కల్గించే అంశంమంటూ పార్టీలోని ఓ ముఖ్య నేత తెలిపారు.
కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతున్నారు..
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్యం వివాదస్పదన వ్యాఖ్యలతో హాట్ టాఫిక్ గా నిలుస్తారనే చర్చ పార్టీలోనే ఉన్నది. సొంత పార్టీ నిర్ణయాలు, ముఖ్య నేతల వైఖరిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం చాలాసార్లు చర్చనీయాంశమైంది. ఇక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన వ్యాఖ్యలతో, సొంత నియోజకవర్గంలో విభేదాలతో వార్తల్లో నిలుస్తూ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తెస్తున్నారనే చర్చకూడా ఉన్నది. డెవలప్ మెంట్, ఇతర అంశాల్లో వ్యత్సాసం చూపుతూ ఇటీవల ఆయన చేసిన కామెంట్లు కాంట్రవర్సీకి తెరలేపాయి. తాజాగా ఎంపీ వంశీకృష్ణ మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో చర్చకు తెరలేపాయి. ఇవన్నీ కొనసాగుతుండగానే తాజాగా జుక్కల్ ఎమ్మెల్యే అధికారంలో ఉండి కూడా ఏకంగా ఓ సీనియర్ మంత్రిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, మంత్రి తనను దూషించారని ఆరోపిస్తూ మీడియా ప్లాట్ ఫామ్ లలో మాట్లాడటంతో హాట్ టాఫిక్ గా మారింది.
ప్రతిపక్షాలకు అస్త్రాలు..
కాంగ్రెస్ నేతలు బహిరంగంగా చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలను ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ ,బీజేపీలు పర్ ఫెక్ట్ గా వాడుకుంటున్నాయి.ప్రభుత్వం ఎంత మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, ఈ అంతర్గత వివాదాల వల్ల ప్రభుత్వ పనితీరు మరుగునపడిపోతోంది. అంతేగాక పాలనపై శ్రద్ధ పెట్టాల్సిన ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత అజెండాలు, అంతర్గత కలహాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్తోంది. మీడియాలో నిత్యం కాంగ్రెస్ నేతల వివాదాల పైనే చర్చలు జరగడం పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తోంది.మూడేళ్లుగా కాంగ్రెస్‌లో ఈ తరహా కాంట్రవర్సీలు కొనసాగుతున్నప్పటికీ, తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు సరిగ్గా తీసుకోకపోవడమే నేతల అతిప్రవర్తనకు కారణమని పార్టీ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది. పీసీసీ నాయకత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా నాయకులు లెక్క చేయడం లేదు. ఢిల్లీ అధిష్ఠానం వద్దకు పంచాయతీలు వెళ్లినా, సర్దుబాటు మంత్రంతో సరి పెడుతుండటంతో కొందరు నేతలు నిరంతరం అదే తీరును పునరావృతం చేస్తున్నారు. ఈ వివాదాలు రాబోయే ఎన్నికలపై ప్రభావం పడే ఛాన్స్ ఉన్నదని టీపీసీసీ వర్గాలు కూడా ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. 10 జన్‌పథ్‌లో రాహుల్ గాంధీతో కీలక భేటీ!