Vande Bharat Sleeper Rules: వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో అలర్ట్. ఈ రైళ్లలో తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులో లేదు. అంటే, ప్రయాణానికి ముందు చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ప్రయాణికులు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP)లోనే టికెట్లు బుక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని భారతీయ రైల్వే మరోసారి స్పష్టం చేసింది.
ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేలా ప్రోత్సహించేందుకే తత్కాల్ కోటాను అందుబాటులో ఉంచలేదని నార్త్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ శివం శర్మ తెలిపారు. అన్ని బెర్త్ లను జనరల్ కోటా కింద అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. దీంతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు జతల వందే భారత్ స్లీపర్ రైళ్లు నడుస్తున్నాయి.
1.27575/27576: హౌరా – కామాఖ్య – హౌరా
2.27421/27422: వారణాసి – న్యూఢిల్లీ – వారణాసి
3.27651/27652: బెంగళూరు SMVT – ముంబై CSMT – బెంగళూరు SMVT
BEML సంస్థ, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) టెక్నాలజీ ఆధారంగా ఈ రైళ్లను అభివృద్ధి చేసింది. గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించారు. ఒక్కో వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 11 ఏసీ 3-టైర్, నాలుగు ఏసీ 2-టైర్, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉంటాయి. మొత్తం 823 మంది ప్రయాణించవచ్చు. ఏసీ 3-టైర్‌లో 611 మంది, ఏసీ 2-టైర్‌లో 188 మంది, ఫస్ట్ ఏసీలో 24 మందికి బెర్త్ లు అందుబాటులో ఉంటాయి. మరో కీలక విషయం ఏమిటంటే, కన్ఫార్మ్ టికెట్ ఉన్నవారికి మాత్రమే ఈ రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. RAC, వెయిట్‌లిస్ట్, పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్లతో ప్రయాణించడానికి అనుమతి లేదు.
వందే భారత్ స్లీపర్ రైళ్ల టికెట్ రద్దు విషయంలో రైల్వే ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది. 72 గంటల కంటే ముందుగా క్యాన్సిల్ చేస్తే, టికెట్ ధరలో 25 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీగా కట్ చేస్తారు. 72 గంటల నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే, టికెట్ ధరలో 50 శాతం ఛార్జీగా తీసుకుంటారు. ప్రయాణానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ లభించదు. సో, వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణించాలనుకునేవారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. చివరి నిమిషంలో టికెట్ కోసం ప్రయత్నిస్తే తత్కాల్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
Read Also: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1,286 కిలోల మాంసం.. రైల్వే స్టేషన్‌లో ఏం జరిగింది?