Endu netthalla iguru recipe: అరటికాయ వేపుడో, పప్పు చారులోకో నంజుకోవడానికి కమ్మనైన నాన్-వెజ్ ఉంటే ఆ తినిన తృప్తే వేరు! అందులోనూ అచ్చ మైన పల్లె టూరు వంటకం అయిన ఎండు నెత్తళ్ల ఇగురు ఉంటే.. అన్నం ఇట్టే తినేస్తాం. చింతపండు పులుపుతో ఘుమఘుమలాడే ఈ ఎండు చేపల ఇగురును చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి? దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం.
మన తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాల్లో ఎండు చేపల కూరకి ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా.. పల్లెటూర్లలో వారానికి ఒక సారైనా ఈ కూర వండుకోవడం ఆనవాయితీ. నేటి మోడర్న్ లైఫ్‌స్టైల్‌లోనూ చాలా మంది ఈ నాటు రుచులను ఎంతో ఇష్టపడుతున్నారు. పర్ఫెక్ట్ కొలతలతో ఈ కమ్మనైన ఇగురును తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో లేదా స్థానిక దుకాణాల్లో 100 గ్రాముల మంచి ఎండునెత్తళ్లు సుమారు రూ. 40 నుంచి రూ.60 వరకు లభిస్తాయి. మొత్తం కూర తయారీకి అయ్యే ఖర్చు సుమారు రూ. 100 లోపే ఉంటుంది. నాలుగు నుంచి ఐదు మందికి సరిపడా ఈ వంటకం తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
ఎండునెత్తళ్లు : 1 కప్పు
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
టమాటాలు: 2 (మెత్తగా తరిగినవి)
చింతపండు: చిన్న నిమ్మకాయ సైజ్ అంత (పులుసు కోసం)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
కారం మరియు పసుపు: రుచికి సరిపడా
ధనియాల పొడి, జీలకర్ర పొడి: 1 టీస్పూన్
నూనె: తగినంత
కరివేపాకు, కొత్తిమీర తరుగు: తగినంత
ఉప్పు: తగినంత
1.ఎండు చేపలతో వంట చేసేటప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ముందుగా.. ఎండు నెత్తళ్లను గోరు వెచ్చని నీటిలో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే దుమ్ము, ధూళి ఈజీగా తొలగిపోతాయి. ఆ తర్వాత వాటిని చల్లటి నీటితో రెండు, మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కావాలనుకుంటే తలలను తుంచివేయెచ్చు.
2.ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. ఆ తర్వాత తరిగిన టమాటాలు వేసి మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు ఉడికించాలి.
3. టమాటా గుజ్జు బాగా ఉడికిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. మసాలాలు మాడి పోకుండా కొద్దిగా నీరు చిలకరించాలి. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్లను ఆ మసాలా మిశ్రమంలో వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు చేపలకు బాగా పడతాయి.
4. చివరగా ముందుగా.. నానబెట్టి తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని (పులుసు) ఆ కూరలో పోయాలి. కూర ఇగురుగా రావడానికి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టాలి. మీడియం మంటపై నూనె పైకి తేలే.. వరకు కూరను ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని దించేయాలి. వేడివేడి అన్నంతో ఈ ఇగురు తింటుంటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.
ఎక్కువ ఖర్చు లేకుండా.. అచ్చమైన పల్లె టూరు రుచిని ఆస్వాదించాలనుకునే వారికి ఎండు నెత్తళ్ల ఇగురు బెస్ట్. కమ్మనైన ఈ నాటు వంటకాన్ని మీ ఇంట్లో ట్రై చేసి అందరితో కలిసి ఎంజాయ్ చేయండి!