Rava Laddu Recipe: మన వంటకాల్లో,ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ పండుగ లేదా శుభకార్యం జరిగినా స్వీట్లు ఉండాల్సిందే. అందులోనూ రవ్వ లడ్డుకి ఉండే క్రేజే వేరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ లడ్డులను చాలా మంది ఇళ్లలో చేస్తుంటారు. కానీ కొన్ని సార్లు సరిగ్గా రాక గట్టిగా అయిపోవడం లేదా రెండు రోజుల్లోనే పాడైపోవడం జరుగుతుంది. అసలు ఎలాంటి తప్పులు చేయకుండా, నెల రోజుల పాటు తాజాగా, సుతిమెత్తగా ఉండేలా రవ్వ లడ్డు తయారు చేయడానికి కొన్ని పర్ఫెక్ట్ కొలతలు, టిప్స్ అవసరం. అవేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం.
బొంబాయి రవ్వ : 2 కప్పులు
పంచదార : 1.5 కప్పులు (పౌడర్ చేసుకోవడానికి)
పచ్చి కొబ్బరి తురుము: 1 కప్పు (లేదా ఎండు కొబ్బరి పొడి)
నెయ్యి (Ghee): 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు, కిస్మిస్: గుప్పెడు
యాలకుల పొడి: 1 స్పూన్
కాచి చల్లార్చిన పాలు లేదా నీరు: లడ్డు చుట్టడానికి తగినన్ని (పాలు వాడితే 3-4 రోజుల్లో తినాలి, నీరు లేదా షుగర్ సిరప్ వాడితే నెల రోజులు నిల్వ ఉంటుంది).
1. ముందుగా స్టావ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో.. రెండు కప్పుల బొంబాయి రవ్వను వేసి మంటను లో-ఫ్లేమ్‌లో ఉంచి మంచి సువాసన వచ్చే వరకు సుమారు 7-8 నిమిషాలు వేయించాలి. రవ్వ రంగు మారకూడదు కానీ బాగా వేగాలి. ఆ తర్వాత అందులోనే కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు వేయించి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఒకటిన్నర కప్పుల పంచదార , యాలకులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పంచదార పొడిని ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. వేడి రవ్వలో పంచదార కలపడం వల్ల అది కొద్దిగా కరిగి రవ్వకు పర్ఫెక్ట్ బైండింగ్ ఇస్తుంది.
Also Read: పక్కా తెలంగాణ స్టైల్ సర్వపిండి..ఒక్క సారి టేస్ట్ చేస్తే అస్సలు వదలరు!
3. నెల రోజులపాటు నిల్వ ఉండాలంటే పాలు పోయకుండా, కాస్త గోరు వెచ్చని నీటిని లేదా పంచదార పాకాన్ని కొద్ది కొద్దిగా చిలకరిస్తూ లడ్డులు చుట్టుకోవాలి. ఒకవేళ మీరు త్వరగా తినేయాలనుకుంటే.. కాచి చల్లార్చిన పాలను కొద్దిగా వాడుకోవచ్చు. నెయ్యిని కూడా కొద్దిగా వేడి చేసి కలుపుకుంటే లడ్డులు విడిపోకుండా గుండ్రంగా వస్తాయి.
4. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ మిశ్రమాన్ని గట్టిగా వత్తుతూ లడ్డులు చుట్టాలి. మధ్యలో వేయించిన జీడి పప్పును అలంకరించాలి. ఈ లడ్డులను ఒక గాలి చొరబడే ప్లాస్టిక్ లేదా గాజు డబ్బాలో భద్రపరుచుకుంటే.. నెల రోజుల పాటు అస్సలు పాడవకుండా రుచిగా ఉంటాయి.
ఎంతో ఈజీగా, ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతోనే.. పక్కా కొలతలతో ఈ సుతిమెత్తని రవ్వ లడ్డును తయారు చేసుకోవచ్చు. రాబోయే పండగకు మీరూ ఈ రెసిపీని ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి!