Ullikaram Roti Pachadi: ప్రస్తుత కాలంలో రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినా, మన తెలుగు వారి పాత కాలం నాటి రోటీ పచ్చళ్ల టేస్టే వేరు. అందులోనూ.. ‘ఉల్లికారం పచ్చడి’ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. సోషల్ మీడియా రీల్స్ నుంచి ఫుడ్ వ్లాగ్స్ వరకు ఎక్కడ చూసినా ఈ ట్రెండింగ్ పచ్చడి గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఇది తయారు చేయడం చాలా ఈజీ. పైగా గంటల తరబడి వంటగదిలో కష్టపడే పని లేకుండా కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మరి ఈ కమ్మనైన ఉల్లికారం పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా..
పెద్ద ఉల్లిపాయలు:3 లేదా 4
ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి: 6 నుంచి 8 (రుచికి సరిపడా)
చింతపండు: చిన్న నిమ్మకాయ సైజ్ అంత
వెల్లుల్లి రెబ్బలు: 8 నుంచి 10 (రూ.5)
జీలకర్ర: 1 టీస్పూన్
ధనియాలు: 1 టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
పోపు దినుసులు: కొద్దిగా
ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను.. వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి. ఉల్లిపాయలోని పచ్చి వాసన పోతే చాలు, మరీ ఎక్కువగా మెత్తబడనవసరం లేదు. అసలైన రుచి రావాలంటే దీన్ని రోట్లో దంచితే చాలా బాగుంటుంది. ఒకవేళ రోలు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్‌లో వేయించిన మిశ్రమం, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు , చిటికెడు ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఆ తాలింపును పచ్చడిలో కలిపితే ఘుమఘుమలాడే ఉల్లికారం పచ్చడి రెడీ!
వేటికి బెస్ట్ కాంబినేషన్:
వేడి వేడి అన్నం: వేడి వేడి అన్నంలో ఈ ఉల్లి కారం వేసుకుని, నెయ్యి లేదా నువ్వుల నూనె తగిలిస్తే ఆ రుచికి సాటి ఏదీ లేదు.
టిఫిన్స్: ఇడ్లీ, దోశ, మినపట్టు, పెసరట్టు వంటి బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌లోకి ఇది అద్భుతమైన కాంబినేషన్‌గా పని చేస్తుంది.
రొట్టెలు: జొన్న రొట్టె, సజ్జ రొట్టె లేదా సాధారణ చపాతీలతో తింటే ఈ కారం రుచి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.
ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా.. అతి తక్కువ పదార్థాలతో ఇంట్లోనే క్షణాల్లో తయారు చేసుకునే ఈ ‘ఉల్లికారం రోటీ పచ్చడి’ ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ ట్రై చేయదగ్గ రెసిపీ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే మీ ఇంట్లో ఈ పచ్చడిని తయారు చేసి మీ కుటుంబ సభ్యులకు వడ్డించండి. కంచం ఖాళీ కావడం ఖాయం!