Chocolate Mug Cake: ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలామందికి ముందుగా గుర్తొచ్చేది కేక్. అయితే కేక్ తయారు చేయాలంటే ఓవెన్ ఉండాలి, ఎక్కువ సమయం కేటాయించాలి అనుకుంటారు. కానీ అలాంటివేవీ లేకుండానే ఇంట్లోనే సులభంగా చాక్లెట్ మగ్ కేక్ తయారు చేసుకోవచ్చు. కేవలం ఐదు నిమిషాల్లోనే వేడివేడి కేక్‌ను సిద్ధం చేసుకోవడం దీని ప్రత్యేకత. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే తయారుచేసే ఈ కేక్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. సాయంత్రం వేళ ఏదైనా తీపిగా తినాలనిపించినప్పుడు, పిల్లలకు నచ్చే స్నాక్ ఇవ్వాలనుకున్నప్పుడు లేదా చాక్లెట్ తినాలనే కోరిక కలిగినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి.
మైదా పిండి – 4 టేబుల్ స్పూన్లు
చక్కెర పొడి – 2 టేబుల్ స్పూన్లు
కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు
పాలు – 3 టేబుల్ స్పూన్లు
నూనె – 2 టేబుల్ స్పూన్లు
బేకింగ్ పౌడర్ – పావు టీస్పూన్
వెనిల్లా ఎసెన్స్ – పావు టీస్పూన్
చాక్లెట్ చిప్స్ – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – చిటికెడు
Also Read: ఎప్పుడైనా అరటి ఆకులో చికెన్ రోస్ట్ చేసి తిన్నారా? ఈ సండే పక్కా ట్రై చేయండి బాస్!
కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మైక్రోవేవ్‌లో ఉపయోగించగల పెద్ద మగ్ తీసుకోవాలి. అందులో మైదా పిండి, చక్కెర పొడి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా పొడి పదార్థాలన్నీ సమానంగా కలిస్తే కేక్ రుచి కూడా బాగుంటుంది.
ఇప్పుడు అందులో పాలు, నూనె, వెనిల్లా ఎసెన్స్ వేసి మిశ్రమాన్ని మృదువుగా కలపాలి. పిండి మరీ గట్టిగా ఉండకుండా, మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి. చివరగా చాక్లెట్ చిప్స్ వేసి మెల్లగా కలపాలి. కేక్ ఉబ్బడానికి వీలుగా మగ్‌లో కొంత ఖాళీ స్థలం ఉండాలి. అందుకే మిశ్రమాన్ని మగ్‌లో సగం నుంచి మూడింట రెండొంతుల వరకు మాత్రమే నింపాలి.
తర్వాత మగ్‌ను మైక్రోవేవ్‌లో పెట్టి సుమారు 60 నుంచి 90 సెకన్ల పాటు ఉడికించాలి. మైక్రోవేవ్ సామర్థ్యాన్ని బట్టి సమయం మారవచ్చు. కేక్ మధ్యభాగం ఉడికిందో లేదో చూసుకోవాలి. అవసరమైతే మరో 10 నుంచి 15 సెకన్లు ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికిస్తే కేక్ గట్టిపడే అవకాశం ఉంటుంది.
కేక్ సిద్ధమైన తర్వాత మైక్రోవేవ్ నుంచి జాగ్రత్తగా బయటకు తీసి ఒక నిమిషం చల్లారనివ్వాలి. పైన చాక్లెట్ సాస్ లేదా కొద్దిగా చాక్లెట్ చిప్స్ వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. ఈ రెసిపీని ఎప్పుడు కావాలంటే అప్పుడు, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.
Also Read: సండే రోజు ‘బోన్ మారో మసాలా’ ఇలా చేశారంటే.. ఇంట్లో వాళ్లందరూ లొట్టలేసుకుంటూ తింటారు!