AI for travel planning| విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది బడ్జెట్, హోటల్ బుకింగ్, ప్రయాణ ఏర్పాట్లు. ఎక్కడికి వెళ్లాలి? ఏ ప్రదేశాలు చూడాలి? ఎంత ఖర్చవుతుంది? ఇలా ఎన్నో సమస్యలకు ముందుగా ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పనులన్నింటికీ చాలామంది ఏఐ టూల్స్ అంటే చాట్ జిపిటీ, జెమిని ఏఐ వంటివి ఉపయోగిస్తున్నారు. కేవలం కొన్ని సెకన్లలోనే ఫుల్ ట్రిప్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. కానీ ఏఐ ఇచ్చే ప్రతి సమాచారం సరైనదేనా? ఒక్కసారి పొరపాటు జరిగితే మీ ప్రయాణం మొత్తం ఇబ్బందుల్లో పడవచ్చు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన తాజా పరిశోధన కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.
ప్రస్తుతం చాలామంది యువ ప్రయాణికులు ట్రిప్ ప్లానింగ్ కోసం ఏఐ సహాయం తీసుకుంటున్నారు. కొత్త ప్రదేశాలను తెలుసుకోవడం, తక్కువ ఖర్చుతో ప్రయాణ మార్గాలను వెతకడం, హోటళ్లను పోల్చడం వంటి పనులకు వీటిని ఉపయోగిస్తున్నారు.
మీడియా నివేదికల ప్రకారం.. ఆస్ట్రేలియాలో 28.8 శాతం మంది ప్రయాణ ప్రణాళిక కోసం ఏఐని ఉపయోగిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ పరిశోధన ప్రకారం.. జెన్ జీ యువతలో ఈ సంఖ్య 30 శాతంగా ఉంది. దీంతో పర్యాటక రంగంలో ఏఐ ప్రభావం పెరుగుతోంది.
ట్రావెల్ కోసం ఏఐ సాయం తీసుకుంటున్న వారిపై ఇటీవలే ఒక అధ్యయనం జరిగింది. ఆస్ట్రేలియాలో 2024-25 సంవత్సరంలో విదేశాలకు వెళ్లిన ప్రయాణాల సంఖ్య 1.23 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.6 శాతం ఎక్కువ. అదే సమయంలో దేశీయంగా 11.3 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి.
ప్రయాణ నిర్ణయాల కోసం ఏఐపై ప్రజలు ఎందుకు ఆధారపడుతున్నారో పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో 5 ముఖ్యమైన అంశాలను గుర్తించారు.
విశ్వసనీయత: ఏఐ ఇచ్చే సమాచారం కచ్చితంగా ఉండాలి.
బాధ్యత: తప్పుడు సూచనలు వస్తే సంబంధిత సంస్థలు బాధ్యత తీసుకోవాలి.
నమ్మకమైన సమాచారం: ప్రయాణికులకు సరైన సలహాలు అందించాలి.
నిష్పక్షపాతం: ఎలాంటి పక్షపాతం లేకుండా సూచనలు ఇవ్వాలి.
పారదర్శకత: ఏఐ నిర్ణయాల గురించి స్పష్టమైన సమాచారం అందించాలి.
సమయం ఆదా చేసుకోవడం, సమాచారాన్ని సులభంగా పొందడం కోసం చాలామంది ఏఐని ఉపయోగిస్తారు. అయితే ప్రతి హోటల్, విమానం, ప్రయాణ మార్గం గురించి ఏఐ సుదీర్ఘ వివరణలు ఇవ్వడం కొన్నిసార్లు తలనొప్పిగా మారుతుంది. పరిశోధన ప్రకారం.. ఎక్కువ వివరణలు ఇచ్చినంత మాత్రాన ఏఐపై నమ్మకం పెరగదు. ప్రయాణికులకు ముఖ్యంగా కావాల్సింది సరైన సమాచారం, తప్పులకు బాధ్యత వహించే సంస్థలు.
Also Read: రైల్వే స్టేషన్‌లో కూలీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడా? ఇలా ఫిర్యాదు చేయండి
ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ స్మార్ట్ ట్రావెలర్ (SmartTraveller) కూడా ఏఐ సమాచారంపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఏఐ పాత రవాణా సమయాలను, తప్పుడు వీసా వివరాలను తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం మూతపడిన హోటల్స్‌లో మంచి సర్వీస్ ఉందని వాటిని రెకమెండ్ చేయవచ్చు.
Also Read: గోవా కంటే బెటర్.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఈ 4 ప్రదేశాలు బెస్ట్
విమానాలు, రైళ్ల సమయాలను చెక్ చేయండి: అధికారిక వెబ్‌సైట్లలో ప్రయాణ సమయాలను పరిశీలించండి.
హోటళ్ల వివరాలను నిర్ధారించుకోండి: హోటల్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోండి.
వీసా నిబంధనలు తెలుసుకోండి: సంబంధిత ప్రభుత్వ వెబ్‌సైట్లలో తాజా వివరాలు చూడండి.
బాధ్యత ఎవరిదో తెలుసుకోండి: ఏఐ సేవలను అందించే సంస్థ వివరాలను పరిశీలించండి.
ఇతర మార్గాల్లోనూ సమాచారాన్ని సేకరించండి: ఏఐ చెప్పిందే చివరి నిర్ణయంగా భావించకండి.
ఏఐ మీ ప్రయాణాన్ని సులభతరం చేయగలదు. కానీ ముఖ్యమైన నిర్ణయాలను పూర్తిగా దానికే వదిలేయకండి. సొంతంగా కూడా వివరాలు పరిశీలిస్తే మీ ప్రయాణాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆస్వాదించవచ్చు.