Apple 20th Anniversary iPhone: యాపిల్ నుంచి వచ్చే ఏడాది విడుదల కావచ్చని భావిస్తున్న 20వ వార్షికోత్సవ ఐఫోన్ గురించి కొత్త లీక్ ఆసక్తి పెంచుతోంది. ఈ ఫోన్ ముందు భాగం ఇప్పటివరకు చూసిన ఐఫోన్ల కంటే భిన్నంగా ఉండొచ్చని ఓ వీడియో సూచిస్తోంది. ముఖ్యంగా డిస్‌ప్లే అంచులు, గ్లాస్ డిజైన్‌లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి బయటకు వచ్చిన సమాచారం మాత్రమే. కంపెనీ నుంచి అధికారికంగా ఎళాంటి వివరాలు వెలువడలేదు.
టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో iPhone 20 Proకు చెందినదిగా చెబుతున్న 3D క్వాడ్ కర్వ్డ్ గ్లాస్ కనిపిస్తోంది. ఈ గ్లాస్ నాలుగు వైపులా వంపుతో ఉండి, ఫోన్ మెటల్ ఫ్రేమ్ వరకు కలిసిపోయేలా కనిపిస్తోంది. అంటే స్క్రీన్ అంచులు, ఫోన్ బాడీ మధ్య స్పష్టమైన గీత తక్కువగా ఉండొచ్చు. ముందు భాగంలో రెండు నల్లటి గుర్తులు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. అవి సెల్ఫీ కెమెరా లేదా ఇతర సెన్సర్లకు సంబంధించినవా అనేది ఇంకా స్పష్టత లేదు.
తాజా లీక్ ప్రకారం.. కొత్త ఐఫోన్‌లో నాలుగు మూలల గుండ్రని ఆకారం కొనసాగవచ్చు. డైనమిక్ ఐలాండ్ కూడా చిన్న సైజులో ఉండే అవకాశం ఉందని అంచనా. ఫేస్ ఐడీకి అవసరమైన సెన్సర్లలో కొన్నింటిని స్క్రీన్ కింద అమర్చే ఆలోచనలో యాపిల్ ఉందనే ప్రచారం కూడా ఉంది. అయితే వీడియోలో కనిపించిన గ్లాస్ ఒక్కటితో ఫోన్ తుది డిజైన్‌ను ఖరారు చేయలేం. విడుదలకు ముందు నమూనాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.
Also Read: పోయిన ఐఫోన్ దొరికిందని మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. కేంద్రం వార్నింగ్!
Other smartphone brands: “We JUST finished switching from curved screens to flat displays, and now you're bringing curved screens back?!
Apple, you're so damn annoying!” pic.twitter.com/4GLjfLNtEY
— Ice Universe (@UniverseIce) November 14, 2026
మరో నివేదిక ప్రకారం.. 2027లో రానున్న వార్షికోత్సవ ఐఫోన్‌లో ప్రత్యేక యాక్షన్ బటన్ ఉండకపోవచ్చు. దాని పనులను కెమెరా కంట్రోల్ బటన్‌తో కలపాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారి నొక్కితే కెమెరా ఓపెన్ అవ్వడం, ఎక్కువసేపు నొక్కితే యూజర్ ఎంచుకున్న యాక్షన్ పని చేయడం వంటి విధానం ఉండొచ్చని చెబుతున్నారు. ఈ మార్పు నిజమైతే ఫోన్ పక్క అంచుపై బటన్ల అమరిక కూడా మారవచ్చు.
iPhone 20 Proలో కొత్త ఏ-సిరీస్ చిప్, వెనుకవైపు మూడు కెమెరాలు ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. 2017లో ఐఫోన్ ఎక్స్‌తో యాపిల్ నాచ్ డిస్‌ప్లేను పరిచయం చేసి, ముందు డిజైన్‌ను మార్చింది. 2027లో వచ్చే మోడల్ కూడా అలాంటి పెద్ద మార్పుకు వేదిక కావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. పదేళ్ల క్రితం ఐఫోన్ ఎక్స్ తీసుకొచ్చిన మార్పుల తరహాలోనే, ఈసారి కూడా కంపెనీ తమ ప్రత్యేక మోడల్‌తో అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటోందని అభిమానులు ఆశిస్తున్నారు.
అయినా ఈ వివరాలన్నీ లీకులు, నివేదికల ఆధారంగానే ఉన్నాయి. ధర, ఫీచర్లు, పేరుపై ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. యాపిల్ ప్రకటన వచ్చే వరకు ఈ సమాచారాన్ని అంచనాలుగానే చూడాలి.