ఇంట్లో అన్నం మిగిలిపోతే అందరూ చేసే పని నిమ్మకాయ పులిహోరగా మార్చేస్తారు. అలాగే కొంతమంది ఎగ్ రైస్ కూడా చేసుకుంటారు. ప్రతిసారి ఇవే కాదు… సరికొత్తగా ఆవ రైస్ కూడా ప్రయత్నించండి. ఆవాలతో చేసే ఈ అన్నం చాలా రుచిగా ఉంటుంది. అన్నట్టు దీన్ని ప్రసాదంగా కూడా నివేదించవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ప్రసాదంగా దీన్ని వడ్డిస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. సులభంగా ఇంట్లోనే ఆవరైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.
ఆవ అన్నం రెసిపీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నం – రెండు కప్పులు
నెయ్యి – రెండు స్పూన్లు
ఆయిల్ – రెండు స్పూను
ఎండుమిర్చి – ఎనిమిది
కరివేపాకులు – గుప్పెడు
మినప్పప్పు – ఒక స్పూను
పచ్చిశనగపప్పు – ఒక స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – అర స్పూను
ఆవాలు -ఒక స్పూను
పచ్చి కొబ్బరి తురుము – రెండు స్పూన్లు
ఆవ రైస్ రెసిపీ
1.ఆవాల రైస్ చేసేందుకు ముందుగానే మీరు అన్నాన్ని వండ పక్కన పెట్టుకోవాలి.
2. అయితే అన్నం ముద్ద కాకుండా పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి.
3. అన్నం వండినప్పుడే అందులో ఉప్పు వేసుకోవచ్చు. లేదా తర్వాత కూడా వేసుకోవచ్చు.
4. ఒక ప్లేట్ లో అన్నాన్ని వేసి విడివిడిగా ఆరబెట్టి ఉంచితే అది ముద్ద కాకుండా ఉంటుంది.
5. ఇప్పుడు మిక్సీలో ఎండుమిర్చి, ఆవాలు, ఉప్పు, పసుపు, పచ్చికొబ్బరి తురుము వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6.తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి.
7. తర్వాత గుప్పెడు కరివేపాకులు కూడా వేసి బాగా వేయించుకోవాలి.
8. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆవాల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి తిరగమోత వేసుకోవాలి.
10. పైన నెయ్యిని వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే ఆవాల రైస్ రెడీ అయినట్టే.
11. దీన్ని సాధారణంగా తింటే టేస్టీగా ఉంటుంది. లేదా ప్రసాదంగా దేవుడికి నివేదించవచ్చు.
12.ఏదైనా దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ప్రసాదం పులిహోరలో కూడా ఆవాలే ప్రధానంగా వాడతారు. కాబట్టి దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
ఆవాలు ప్రతిరోజు తినాల్సిన అవసరం ఉంది. చిన్నగా ఉండే ఈ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మన గుండె ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా చాలా వరకు తగ్గిస్తాయి. ఆవాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కాబట్టి మన శరీరంలో చేరే ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తిని ఇవి మన రోగనిరోధక వ్యవస్థకు అందిస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకం నుండి కాపాడడానికి ఆవాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి అప్పుడప్పుడు ఆవరైస్ ను ఆహారంలో భాగం చేసుకోండి. ఈ ఆవాల అన్నం రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.