Vankaya Nuvvula Pachadi: వంటకాల్లో రోటి పచ్చళ్లకు ఉండే క్రేజే వేరు. పిండి వంటలు ఎన్ని తిన్నా, అమ్మ చేతి వంట రుచినిమించేది మాత్రం మన ఊరగాయ పచ్చళ్లే. అందులోనూ వంకాయతో.. చేసే పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం. వంకాయ, నువ్వులతో చేసే ఈ రోటి పచ్చడి కేవలం రుచి లోనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నువ్వులలో ఉండే కాల్షియం, ఐరన్ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.అందరూ ఇష్టపడే ఈ వంకాయ నువ్వుల రోటి పచ్చడి తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
వంకాయలు – 4
తెల్ల నువ్వులు – 3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి – 6 నుండి 8
చింతపల్లి లేదా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు
వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 8
జీలకర్ర – 1 టీస్పూన్
పసుపు – చిటికెడు
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – కొద్దిగా
పోపు దినుసులు (ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు)
1. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి, అందులో ఎలాంటి నూనె వేయకుండా తెల్ల నువ్వులు వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకుని నువ్వులు చిటపటలాడే వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు మాడిపోతే పచ్చడి చేదు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. అదే ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి, తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వంకాయ ముక్కలు మెత్త బడే వరకు మూతపెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.వంకాయలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
Also Read: కాలీఫ్లవర్‌తో ఇలా వేపుడు చేయండి..రుచి చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!
2. మీకు అసలైన పల్లెటూరి రుచి కావాలంటే.. రోట్లో నూరుకోవడం బెస్ట్. రోలు లేని వారు మిక్సీ జార్ని ఉపయోగించవచ్చు. ముందుగా.. వేయించి పెట్టుకున్న నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, జీల కర్ర, తగినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత మగ్గించి.. పెట్టుకున్న వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా కొత్తిమీర వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకోవాలి.
3. ఇప్పుడు పచ్చడిని మరింత రుచిగా మార్చడానికి చిన్న ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి కాగాక.. ఆవాలు, జీల కర్ర, మిన పప్పు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి , కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపును ముందుగా తయారు చేసుకున్న వంకాయ నువ్వుల పచ్చడి లో కలపాలి. అంతే..గుమ గుమలాడే కమ్మని వంకాయ నువ్వుల రోటి పచ్చడి రెడీ!
వేడి వేడి అన్నంలో.. కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ వంకాయ నువ్వుల రోటి పచ్చడితో తింటే.. ఆ మజానే వేరు. లంచ్ బాక్స్‌లోకి లేదా రాత్రి పూట చపాతీలతో కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.