Chicken pulao recipe: ఆదివారం వచ్చిందంటే మన ఇంట్లలో ముందుగా గుర్తుకు వచ్చేది నాన్‌వెజ్ వంటకాలే. అందులోనూ చికెన్ పులావ్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. దమ్ బిర్యానీ చేయడం కాస్త శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ, చికెన్ పులావ్ మాత్రం తక్కువ సమయంలో.. ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. అయితే.. ఇది పర్ఫెక్ట్ టేస్ట్‌తో రావాలంటే.. కొన్ని మెలకువలు కచ్చితంగా పాటించాలి. చికెన్ పులావ్ రుచిగా రావడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం!
బాస్మతి బియ్యం – 2 కప్పులు (సగం గంట నానబెట్టినవి)
చికెన్ – 500 గ్రాములు
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 5 లేదా 6
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 స్పూన్లు
పెరుగు – అర కప్పు
పుదీనా మరియు కొత్తిమీర తరుగు -ఒక కప్పు
మసాలా దినుసులు (బిర్యాని ఆకు,చెక్క,లవంగాలు,యాలకులు,షాజీరా,నక్షత్ర పువ్వు)
పసుపు – చిటికెడు
ధనియాల పొడి – 1 స్పూన్
గరం మసాలా – అర స్పూన్
నెయ్యి మరియు నూనె -తగినంత
ఉప్పు -రుచికి సరిపడా
నిమ్మరసం -ఒక స్పూన్
1.చికెన్ పులావ్ రుచిగా రావడానికి మొదటి మెట్టు మంచి మ్యారినేషన్. శుభ్రం చేసుకున్న చికెన్‌లో కొద్దిగా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు ,నిమ్మరసం వేసి కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం.. వల్ల చికెన్ ముక్కలు చాలా జ్యూసీగా, మెత్తగా మారతాయి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ లేదా వెడల్పు మందపాటి గిన్నె పెట్టి, తగినంత నూనె, రెండు స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక బిర్యాని ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా వేసి వేయించాలి. ఆ తర్వాత పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు బాగా వేయించాలి.
Also Read: పక్కా కొలతలతో అదిరిపోయే టమాటో పచ్చడి..ఎన్ని రోజులైనా టేస్ట్ మారదు!
2. ఉల్లిపాయలు వేగాక మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ను అందులో వేసి, నూనె పైకి తేలే వరకు ఐదు నిమిషాలు మీడియం మంటపై ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి , గరం మసాలా వేసి బాగా కలపాలి.ఇప్పుడు రెండు కప్పుల బాస్మతి బియ్యానికి మూడున్నర కప్పుల నీళ్లు పోయాలి. పులావ్‌కి సరి పడా ఉప్పు వేసి నీరు బాగా మరగనివ్వాలి. నీరు మరుగుతున్నప్పుడు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని నీరు లేకుండా వడకట్టి వేయాలి. ఒక సారి మెల్లగా కలిపి, మూతపెట్టి మీడియం మంటపై.. అన్నం పొడిపొడిలాడే వరకు ఉడికించాలి.చివరగా కొద్దిగా నెయ్యి, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే! ఘుమఘుమలాడే వేడి వేడి.. రెస్టారెంట్ స్టైల్ చికెన్ పులావ్ రెడీ. దీన్ని ఆనియన్ రైతా లేదా టమాటో చట్నీతో తింటే ఆ రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్‌లో ఈ సింపుల్ టిప్స్‌తో చికెన్ పులావ్ చేసి టేస్ట్ చేయండి.