Vodka Sugarcane Juice| మద్యం తాగడాన్ని ఇష్టపడే వారు తరచూ కొత్త కొత్త డ్రింక్స్ తో ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు సీజనల్ జ్యూస్‌లు లేదా సోడాను మద్యంతో కలుపుతారు, మరికొందరు దాన్ని కూల్ డ్రింక్స్ తో మిక్స్ చేసి తాగుతుంటారు. అయితే ఇటీవల, వోడ్కాను చెరకు రసంతో కలిపి తాగడం బాగా ట్రెండ్ గా మారింది. అయితే, ఈ రెండు పదార్థాలు వేర్వేరు లక్షణాలను కలిగి ఉండటం వల్ల, వీటి కలయిక ఆరోగ్యానికి హానికరంగా ఉండవచ్చు. వోడ్కా ఒక మద్య పానీయం, కానీ చెరకు రసం ఆరోగ్యానికి శక్తిని అందిస్తుంది. శరీరానికి చల్లదనం అందిస్తుంది. ఈ రెండూ కలిపి తాగడం వల్ల కలిగే సంభావ్ ఆరోగ్య సమస్యలకు ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగడం
100 మిల్లీలీటర్ల చెరకు రసంలో సుమారు 13–15 గ్రాముల చక్కెర ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. అయితే, వోడ్కా వంటి మద్య పానీయాలు కాలేయంపై చెడు ప్రభావం చూపుతాయి. ఈ రెండింటి కలయిక చక్కెర జీవక్రియను దెబ్బతీస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఈ మిశ్రమం విషంతో సమానం. చెరకు రసంలోని అధిక చక్కెర, వోడ్కా కలిసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టతరం చేస్తాయి, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరం.
శరీరంలో నీటి స్థాయి విపరీతంగా తగ్గిపోయే (డీహైడ్రేషన్) ప్రమాదం
వోడ్కా ఒక డైయూరెటిక్, అంటే ఇది శరీరంలో నీటిని తగ్గించి.. మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. చెరకు రసంలో అధిక చక్కెర ఉండటం వల్ల దాన్ని జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు అవసరం. ఈ రెండింటి కలయిక వల్ల.. ముఖ్యంగా వేసవిలో, నీటి లోపం ప్రమాదం బాగా పెరుగుతుంది. శరీరం త్వరగా నీటిని కోల్పోవచ్చు, ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
జీర్ణ సమస్యలు
చెరకు రసంలో పోలికోసనాల్ అనే ఒక పదార్థం ఉంటుంది. అందుకే చెరకు రసం అధికంగా తాగితే.. వాంతులు, తలతిరగడం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అదే సమయంలో, మద్యం జీర్ణవ్యవస్థను మరింత సున్నితంగా చేస్తుంది. వోడ్కా, చెరకు రసం కలిపి తాగడం వల్ల శరీరానికి మరింత హాని కలుగుతుంది, పైగా జీర్ణ సమస్యలు తీవ్రమవుతాయి.
ఇన్ఫెక్షన్ ప్రమాదం
రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తరచూ పరిశుభ్రత ప్రమాణాలను పాటించకుండా తయారవుతుంది. ఇది హెపటైటిస్ ఎ, హెపటైటిస్ ఇ.. వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. దీన్ని మద్యంతో కలిపి తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి మరింత బలహీనపడుతుంది, ఇది ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది.
Also Read: సిగరెట్‌తో పాటు టీ తాగుతున్నారా?.. ఆరోగ్యానికి చాలా హానికరం జాగ్రత్త.. ఎందుకంటే?
బరువు పెరగడం, ఫ్యాటీ లివర్ ప్రమాదం
చెరకు రసంలో అధిక కేలరీలు మరియు చక్కెర ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి. మద్యంతో కలిపినప్పుడు, ఇది కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది, ఫ్యాటీ లివర్ సమస్యను పెంచుతుంది. ఈ కలయిక కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మొత్తంగా చూస్తే.. వోడ్కా, చెరకు రసం కలయిక అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి, ఈ మిక్స్ డ్రింక్ కు వీలైనంతగా దూరంగా ఉండడం మంచిది.