Kidneys Healthy: మన జీవనశైలిలో రోజూ పాటించే చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో పెద్ద ప్రభావం చూపుతాయి. అందులో ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్యం కోసం మనం దృష్టి సారించాల్సిన అంశం శరీరానికి సరిపడా నీరు తాగడం. కిడ్నీలు శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచి, అనవసరమైన వ్యర్థాలు, విషపదార్థాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంటాయి. ఈ శుద్ధి ప్రక్రియ సాఫీగా సాగాలంటే శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకునే బాధ్యత మనపైనే ఉంది. రోజులో తగినంత నీరు తాగకపోతే కిడ్నీల పనితీరు మందగించి, క్రమంగా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. అందుకే రోజూ నీటి అవసరాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అలవాటుగా సరిపడా నీరు తాగడం అనేది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునే సులభమైన మార్గం అని చెప్పవచ్చు.
రోజూ శరీరానికి సరిపడా నీరు అందితే కిడ్నీలపై పడే భారం గణనీయంగా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటిస్థాయి సరిగ్గా ఉంటే.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గడమే కాకుండా, మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. సాధారణంగా రోజుకు 6-8 గ్లాసుల నీరు తాగడం మంచిదని చెబుతున్నా.. ఈ పరిమాణం ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మారుతున్న వాతావరణం, రోజూ చేసే పని, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి నీటి అవసరం మారుతుందని వారు సూచిస్తున్నారు.
Also Read: ఎలక్ట్రోలైట్స్ అంటే ఏమిటి?.. మన శరీరానికి ఎందుకు అవసరం?
నీరు శరీరాన్ని సహజంగా శుద్ధి చేసే అత్యంత సులభమైన మార్గం. మూత్రం, చెమట, మలం ద్వారా శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు వెళ్లేందుకు నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా.. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడం, కీళ్లు సాఫీగా కదలడంలో సహాయపడటం, కణజాలాలను రక్షించడం వంటి అనేక ముఖ్యమైన పనులు కూడా నీటితోనే సాధ్యమవుతాయి. శరీరంలో నీటి కొరత ఏర్పడితే ఈ వ్యవస్థలన్నీ నెమ్మదిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరానికి సరిపడ నీరు అందకపోతే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ యూరిక్ యాసిడ్ కిడ్నీల ద్వారానే బయటకు వెళ్లాలి. కానీ సరిపడా నీరు లేకపోతే, అది కిడ్నీల్లోనే పేరుకుపోయి రాళ్లుగా మారే ప్రమాదం ఉంటుంది. స్వల్ప డీహైడ్రేషన్ కూడా కిడ్నీల యొక్క వడకట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని, తీవ్రమైన పరిస్థితుల్లో మూత్రపిండాలు దెబ్బతినే అవకాశముందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాయామం చేసే సమయంలో, ఎక్కువగా శారీరక శ్రమ చేసే పనుల్లో లేదా వేడి, తేమ అధికంగా ఉన్న వాతావరణంలో నీటి అవసరం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.
ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారు శరీరం నుంచి నీరు, లవణాలను వేగంగా కోల్పోతారు. ఫలితంగా డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువై, దీర్ఘకాలంలో మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే కిడ్నీల ఆరోగ్యం కోసం నీరు తాగడమే కాకుండా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవడం అవసరం.
బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే.. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, ఆకుకూరలు వంటి ఆహారాలు శరీరానికి మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లు కూడా హైడ్రేషన్‌కు మంచి ఎంపిక. దీంతోపాటు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్‌ను దూరం పెట్టడం ద్వారా కిడ్నీలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఇకపోతే.. నీరు కేవలం అలవాటు మాత్రమే కాదు. కిడ్నీలకు అది ఒక మౌలిక అవసరం. రోజూ సరిపడా నీరు తాగడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను ముందుగానే నివారించవచ్చు. అయితే ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం నీటి పరిమాణం విషయంలో తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
Also Read: ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా?.. ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!