Gardening Tips| ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా? వాటికి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తున్నా ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? మొక్కల పెరుగుదల నెమ్మదించిందా? అయితే వాటికి సరైన పోషకాలు అందుతున్నాయో లేదో గమనించాలి. మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే నీళ్లతో పాటు నేలలో పోషకాలు కూడా అవసరం. ఇందుకోసం ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఎరువు తయారు చేసుకోవచ్చు.
గార్డెనింగ్ ఎక్స్‌పర్ట్ చేతన భల్లా తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఇంట్లో ఎరువు తయారు చేసుకునే పద్ధతిని వివరించారు. ఉపయోగించిన టీ పొడి, ఉల్లిపాయ తొక్కలు, ఎండిన అరటిపండు తొక్కలు, వైట్ చాక్ పీస్‌లతో ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. అయితే, ఈ మిశ్రమంలో పోషకాల పరిమాణం కచ్చితంగా ఎంత ఉంటుందో పరీక్షించకుండా చెప్పలేం.
ఈ ఎరువును తయారు చేయడానికి రోజువారీగా లభించే నాలుగు పదార్థాలు అవసరం.
రెండు కప్పుల ఉపయోగించిన టీ పొడి
రెండు చాక్ పీస్‌లు
మూడు ఉల్లిపాయల తొక్కలు
రెండు ఎండిన అరటిపండు తొక్కలు
టీ పొడి, అరటిపండు తొక్కల్లో తేమ లేకుండా చూసుకోవాలి. పదార్థాలు పూర్తిగా ఎండితే వాటిని పొడిగా మార్చడం సులభమవుతుంది.
ముందుగా టీ పొడి, చాక్ పీస్, ఉల్లిపాయ తొక్కలు, ఎండిన అరటిపండు తొక్కలను సేకరించండి. వీటన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా తయారు చేయండి. పదార్థాలన్నీ బాగా కలిసేలా గ్రైండ్ చేయాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని పొడి ప్రదేశంలో, తేమ చేరకుండా నిల్వ చేయవచ్చు.
గార్డెనింగ్ నిపుణురాలు చేతన భల్లా సూచన ప్రకారం.. ఈ మిశ్రమాన్ని నెలకు ఒకసారి మొక్కల మట్టిలో వేయవచ్చు. అయితే, మొదట చాలా తక్కువ పరిమాణంతో ప్రారంభించడం మంచిది.
ప్రతి మొక్కకు ఒకే రకమైన పోషకాలు, ఒకే పరిమాణంలో అవసరం ఉండవు. అందువల్ల ఎరువు వేసిన తర్వాత మొక్కల పరిస్థితిని గమనించాలి. ఎక్కువ మోతాదులో వేస్తే నేలలో పోషకాల సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.
Also Read: ఎవరికీ హాని చేయలేదు అయినా జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారు.. అయినవాళ్లను దూరం చేసే 7 అలవాట్లు
ఉపయోగించిన టీ పొడిలో సేంద్రియ పదార్థాలు, కొంత నైట్రోజన్ ఉంటాయి. నైట్రోజన్ ఆకుల పెరుగుదలకు, మొక్కల అభివృద్ధికి సహాయపడుతుంది. టీ పొడిని కంపోస్ట్‌లో కలిపి ఉపయోగించడం నేల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ తొక్కల్లో కొంత పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉండవచ్చు. అరటిపండు తొక్కల్లో పొటాషియం సహా కొన్ని పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కల సాధారణ ఎదుగుదలకు అవసరమైన పోషకాల్లో భాగం.
వైక్ చాక్ (తెల్ల సుద్ద) లో సాధారణంగా కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఇది నేలలోని pH స్థాయిని పెంచేందుకు సాయపడుతుంది. కాబట్టి నేల స్వభావం తెలియకుండా సుద్దను ఉపయోగించడం మంచిది కాదు.
ఈ ఇంటి చిట్కా ద్వారా వంటగది వ్యర్థాలను ఉపయోగకరంగా మార్చుకోవచ్చు. అయితే, ఈ మిశ్రమంలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎంత ఉన్నాయో ప్రయోగశాల పరీక్షల ద్వారానే నిర్ధారించాలి.
మొక్కలకు అవసరమైన పోషకాలు అందించేందుకు క్వాలిటీ కంపోస్ట్ లేదా సమతుల్య ఎరువులను కూడా ఉపయోగించవచ్చు. మొక్కల రకం, నేల పరిస్థితిని బట్టి ఎరువును ఎంచుకోవడం బెస్ట్.