Bone Health: బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. బరువు తగ్గడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
బరువు తగ్గడం ఎముకలను ఎలా ప్రభావితం చేస్తుంది?
వేగంగా లేదా ఎక్కువ బరువు తగ్గినప్పుడు ఎముకల సాంద్రత (బోన్ మినరల్ డెన్సిటీ – BMD) తగ్గే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా, మెనోపాజ్ తరువాత స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఆస్టియోపొరోసిస్, ఎముకలు సులభంగా విరగడం వంటివి పెరుగుతాయి. అయితే, నెమ్మదిగా తక్కువ బరువు తగ్గినప్పుడు ఈ ప్రభావం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కొత్త అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
వ్యాయామం ముఖ్యం: బరువు తగ్గే సమయంలో బలం పెంచే వ్యాయామాలు, జంప్ వ్యాయామాల వల్ల ఎముకల సాంద్రతను కాపాడుకోవచ్చు. ఉదాహరణకు, జిమ్నాస్టులు ఎక్కువ బరువు లేకపోయినా వారు చేసే వ్యాయామాల వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
క్యాల్షియం, విటమిన్ డి:
బరువు తగ్గే సమయంలో క్యాల్షియం, విటమిన్ డి తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజుకు కనీసం 3 సర్వింగ్ లలో కాల్షియమ్ ఉన్న ఆహారాలు (పాలు, జున్ను, ఆకుకూరలు) వంటివి తీసుకోవాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.
పరిమిత కేలరీలు:
చాలా తక్కువ (800 కేలరీల కంటే తక్కువ) కేలరీల డైట్ తీసుకోవడం వల్ల ఎముకలకు హాని కలగవచ్చు. మహిళలైతే రోజుకు కనీసం 1200 కేలరీలు, పురుషులు 1400 కేలరీలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
మెనోపాజ్ తరువాత స్త్రీలు: ఈ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గి ఎముకలు బలహీనంగా మారే ప్రమాదం ఎక్కువ.
వృద్ధులు: వయసు పెరిగే కొద్దీ వృద్ధులలో సహజంగానే ఎముకల సాంద్రత తగ్గుతుంది, బరువు తగ్గడం వల్ల ఈ ప్రక్రియ ఇంకా వేగవంతం కావచ్చు.
తీవ్రమైన బరువు తగ్గింపు: బారియాట్రిక్ సర్జరీ, తీవ్రమైన డైటింగ్ లు ఎముకల సాంద్రతను మరింత తగ్గించవచ్చని నిపుణుల హెచ్చరిక.
ఎముకల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
బరువు తగ్గాలి అనుకునేవారు పాటించవలసిన కొన్ని సలహాలు.
బలం పెంచే వ్యాయామాలు: నడక, యోగా, వెయిట్ లిఫ్టింగ్ వంటివి ఎముకల బలాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
సమతుల ఆహారం: కాల్షియమ్, విటమిన్ డి, ప్రోటీన్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
వైద్య సలహా: బరువు తగ్గే ముందు వైద్యుడిని సంప్రదించి ఎముకల సాంద్రత పరీక్షలు చేయించుకుని అప్పుడు వైద్యుని సలహా మేరకు బరువు తగ్గండి.