పురుషులు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ ఏదైనా కారణంతో పాజిటివ్ వస్తుందా? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే.. నిజానికి కొన్నిసార్లు పురుషులకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ రావచ్చు అంటున్నారు వైద్యులు. నూటికి 99 శాతం మంది పురుషులకు ప్రెగ్నెన్సీ టెస్టులో నెగెటివ్ వస్తుందని, ఎవరో ఒకరికి పాజిటివ్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. దీనికి సంబంధించి పూణేలోని అంకురా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ లో గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని రాథోడ్ కీలక విషయాలు వెల్లడించారు. “పురుషుడు గర్భధారణ పరీక్ష చేయించుకుంటే.. దాదాపు నెగెటివ్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ పరీక్షలు గర్భధారణ సమయంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ HCG (హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్)ను గుర్తించడానికి రూపొందించబడ్డాయి. అయితే, అరుదైన సందర్భాల్లో పురుషుడికి ఈ పరీక్షలో పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని అర్థం అతడు ప్రెగ్నెంట్ అని కాదు. వైద్యపరంగా ఒక సమస్య కావచ్చు” అన్నారు.
“కొన్ని రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా వృషణ క్యాన్సర్, HCGని మార్కర్ గా ఉత్పత్తి చేయగలవు. అందుకే పురుషులలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కొన్నిసార్లు పాజిటివ్ గా వస్తుంది. ఒకవేళ వారికి పాజిటివ్ వస్తే, తీవ్రమైన అంతర్లీన ఆరోగ్య సమస్యకు హెచ్చరిక సంకేతంగా గుర్తించాల్సి ఉంటుంది. దానిని ఎప్పుడూ లైట్ తీసుకోవద్దు. వెంటనే తగిన వైద్య చికిత్స తీసుకోవడం మంచిది” అని డాక్టర్ అశ్విని వెల్లడించారు.
ఇక పురుషులలో పునరుత్పిత్తి సమస్యలు ఈ రోజుల్లో కామన్ అయ్యాయని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. లైఫ్ స్టైల్ ను మార్చుకోవడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వంధ్యత్వ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు. పురుషులు మంచి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలంటే..
⦿డాక్టర్ ను కలవాలి: ఒకవేళ మీకు వంధ్యత్వ సమస్యలు ఉన్నట్లు భావిస్తే, వెంటనే వైద్యుడిని కలవాలి. అక్కడ అవసరమైన పరీక్షలు చేసి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించే అవకాశం ఉంటుంది.
⦿ధూమపానం, మద్యపానం మానేయండి: పురుషులలో లైంగిక వంధ్యత్వానికి కారణం ధూమపానం. పురుషులలో అంగస్తంభన సమస్యకు కారణం అవుతుంది. ఎక్కువ మొత్తంలో మద్యం సేవించడం సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. వీలైనంత వరకు ధూమపానం, మద్యపానం అలవాటును మానుకోవడం మంచిది.
⦿పరిశుభ్రతను పాటించండి: ఇది అత్యంత ముఖ్యమైన విషయం. జననేంద్రియాలలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే క్రిములు పేరుకుపోకుండా నిరోధించేందుకు క్రమం తప్పకుండా అక్కడ శుభ్రంగా ఉంచుకోవాలి.
⦿ మంచి లైఫ్ స్టైల్: ఊబకాయం లాంటి సమస్యలకు దూరంగా ఉండాలి. ఊబకాయం అనేది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. సరైన పోషకాహార ఆహారం, సరైన శారీరక శ్రమను చేయడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ మంచి ఆరోగ్యంతో ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 15-20 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.
⦿ఇన్ఫెక్షన్లను నివారించండి: క్లామిడియా, గనేరియా లాంటి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు పురుషులలో వంధ్యత్వానికి కారణమవుతాయి. మీ లైంగిక భాగస్వాముల సంఖ్యను పరిమితం చేయడం, సంభోగం సమయంలో రక్షణను ఉపయోగించడం ద్వారా వీటిని అదుపులో ఉంచుకోవచ్చు.
Read Also: పానీ పూరి తిని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. హైదరాబాద్ యువకుడికి భయానక అనుభవం!