Diabetic Patient: డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తరచుగా టాయిలెట్‌కు వెళ్లడం ఒక సాధారణ లక్షణం. వైద్య పరిభాషలో దీన్ని పాలీయూరియా అని పిలుస్తారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి, దీన్ని తగ్గించుకోవడం సాధ్యమేనా అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలు (గ్లూకోజ్) అధికంగా ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదనపు గ్లూకోజ్‌ని శరీరం బయటకు పంపించాలని ప్రయత్నించడం వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు. రక్తం నుండి గ్లూకోజ్‌ను కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయట. గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, అది మూత్రంలో కలిసిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్ల మూత్రం పరిమాణం పెరిగి, తరచూ మూత్రవిసర్జన జరుగుతుందట. రాత్రి పగలు తేడా లేకుండా ఇలా జరుగుతూనే ఉంటుంది. అందుకే డయాడెటిస్ సమస్య ఉన్నవారు తరచుగా టాయిలెట్‌కి వెళ్తారు. దీని వల్ల చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్న వారు తరచూ టాయిలెట్‌కి వెళ్లడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుందట. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ డీహైడ్రేషన్ కారణంగా రోగులకు ఎక్కువ దాహం వేస్తుందట. దీన్ని పాలీడిప్సియా అని పిలుస్తారట. డీహైడ్రేషన్ వల్ల ఎక్కువ నీరు తాగితే మళ్లీ మూత్రం ఎక్కువగా వస్తుంది. డయాబెటిస్ కంట్రోల్‌లో లేనప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ALSO READ: వయసు పెరుగుతున్న కొద్దీ నిద్రకు దూరమైపోతున్నారా?
చాలా కాలంగా డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో నరాలు దెబ్బతింటాయి. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అని పిలుస్తారు. ఇది మూత్రాశయ నియంత్రణను దెబ్బతీస్తుంది. ఈ సమస్య వల్ల మూత్రం ఆపుకోలేక, తరచూ టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా డయాబెటిస్ సమస్య ఉన్న వారిలో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు (UTI) ఎక్కువగా వస్తాయి. మూత్రంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది. దీనివల్ల కూడా తరచూ మూత్రవిసర్జన జరుగుతుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
డయాబెటిస్ రోగులు ఈ సమస్యను తగ్గించుకోవాలంటే రక్తంలో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం, సరైన ఆహారం, వ్యాయామం చేయాలి. అంతేకాకుండా డాక్టర్ సూచించిన మెడిసిన్‌ను రెగ్యూలర్‌గా తీసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాకుండా తగినంత నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య రాకుండా శరీరాన్ని రక్షించుకోవచ్చు. అయితే అతిగా నీరు తాగడం వల్ల మూత్రం ఎక్కువవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఈ లక్షణం చాలా ఇబ్బంది కలిగిస్తే, ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చినట్లుగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.