Old People: నిద్ర అనేది శరీరానికి చాలా అవసరం. వృద్ధులు ఆరోగ్యంగా ఉండాలంటే బాగా నిద్రపోవడం అత్యంత అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో జరిగే హార్మోనల్ మార్పులు, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి కారణంగా వృద్ధులు రాత్రిళ్లు నిద్రపట్టడం కష్టమవుతుంటుంది. సరిగా నిద్రపట్టకపోవడం వల్ల మానసిక ఒత్తిడి, అలసట వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. అయితే, కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం వల్ల వృద్ధులు నిద్రలేమి సమస్య నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వృద్ధులు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరంలోని బయోలాజికల్ క్లాక్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. నిద్రకు ముందు ఒక గంట పాటు ప్రశాంత వాతావరణం కల్పించుకుంటే మెరుగైన నిద్ర సాధ్యమవుతుంది.
శరీరానికి మంచి నిద్ర కావాలంటే కాఫీ, టీ వంటి కెఫైన్ ఉత్పత్తులను సాయంత్రం తర్వాత తీసుకోవడం మానుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే ఆల్కహాల్ వల్ల కూడా నిద్రలేమి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. వీలైనంత వరకు వీటిని తీసుకోకపోవడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
నిద్రపోయే గది చల్లగా, శుభ్రంగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలట. అంతేకాకుండా వెలుగు తక్కువగా ఉండేలా చేయాలి. వీలైతే నైట్‌ల్యాంప్ లేదా సాఫ్ట్ లైట్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: గర్భిణీలు.. అలాంటి ఆహారం తింటే చాలా డేంజర్..!
ప్రతి రోజు ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో వ్యాయామం చేయడం వల్ల రాత్రి నిద్ర బాగా పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ, నిద్రపోయే ముందు మాత్రం వ్యాయామం చేయడం సరికాదట. అది శరీరాన్ని మేల్కొలిపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మంచి నిద్ర కావాలంటే స్క్రీన్ టైంను తప్పకుండా తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు వంటి స్క్రీన్ ఆధారిత పరికరాలను నిద్రకు కనీసం ఒక గంట ముందు వాడకూడదని అంటున్నారు. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల నిద్రపట్టడం కష్టమవుతుందట.
ధ్యానం, వ్యాయామాలు, సానుకూల ఆలోచనలు నిద్రను మెరుగుపరుస్తాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. వృద్ధులు ఏవైనా మానసిక ఒత్తిడులు ఎదుర్కొంటుంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల అవి చాలా వరకు తగ్గిపోతాయట. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రలేమి సమస్యలు మితిమీరినప్పుడు మానసిక వైద్యులు లేదా న్యూనరోలాజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు నిద్రలేమి అనేది ఇతర ఆరోగ్య సమస్యల సంకేతంగా కూడా ఉండవచ్చు. డిప్రెషన్, అల్జీమర్స్, థైరాయిడ్ వంటి సమస్యల వల్ల కూడా నిద్రలేమి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. అందుకే ఈ సమస్య చాలా ఎక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను వలవడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.