Big Tv Live Originals: ప్రపంచ వ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్ లు ఆయాన దేశాల రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ప్రజా రవాణా, సరకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఏ దేశంలో ఉంది? భారతదేశం ఈ లిస్టులో ఏ స్థానంలో ఉంది? అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అమెరికాలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్
తాజాగా గణాంకాల ప్రకారం అమెరికా ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉంది. ఈ దేశంలో సుమారు 2,50,000 కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. ఈ విస్తృతమైన నెట్ వర్క్ సరుకు రవాణాకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అమెరికాలో అమ్ ట్రాక్ లాంటి ప్యాసింజర్ రైళ్లు, డెసెరెట్ పవర్ రైల్వే లాంటి ప్రైవేట్ సరుకు రైళ్లు ఈ నెట్ వర్క్ లో భాగంగా ఉన్నాయి. అమెరికాలో విశాలమైన భౌగోళిక విస్తీర్ణం కారణంగా, ఈ రైలు మార్గాలు ప్రధాన నగరాలు, పారిశ్రామిక కేంద్రాలను కెనెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తాజా డేటా ప్రకారం అమెరికాలో 1,700 కి.మీ. కంటే ఎక్కువ రైల్వే రూట్లు ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఇందులో లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్, మెట్రో నార్త్ రైల్ రోడ్ లాంటివి ఉన్నాయి.
రెండు, మూడు స్థానాల్లో చైనా, రష్యా
ఇక అమెరికా తర్వాత అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశంగా చైనా గుర్తింపు తెచ్చుకుంది. చైనాలో సుమారు 1,50,000 కిలో మీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. ఇందులో ప్రపంచంలోనే అతి పెద్ద హై స్పీడ్ రైల్వే వ్యవస్థ కూడా ఉంది. మూడో స్థానంలో రష్యా నిలిచింది. ఈ దేశంలోనూ ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా కోసం రైల్వే నెట్ వర్క్ ను ఉపయోగిస్తున్నారు.
నాలుగో స్థానంలో భారతీయ రైల్వే
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ లో సుమారు 70 వేల కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. ఈ నెట్ వర్క్ అంతా భారతీయ రైల్వే సంస్థ నిర్వహణలో ఉంది. అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ ఒకే సంస్థ కింద ఉన్న దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది. భారతీయ రైల్వేలో నిత్యం 20 వేల రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. వాటిలో 13,000 రైళ్లు ప్రజా రవాణాకు ఉపయోగిస్తుండగా, మిగతా రైళ్లను సరుకు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. 2030 నాటికి దేశ వ్యాప్తంగా పూర్తి విద్యుదీకరణ చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. అమెరికా, చైనా రైల్వే నెట్ వర్క్ పరిమాణంలో ముందున్నప్పటికీ, భారతదేశం ప్రయాణీకుల సంఖ్య, సాంస్కృతిక ప్రాముఖ్యతలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇప్పుడిప్పుడే భారతీయ రైల్వే సంస్థ ప్రపంచ దేశాలకు ధీటుగా సరికొత్త హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: ఏజెంట్ల ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చా? ఆ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుంది?