Uttar pradesh: పాఠశాల ప్రిన్సిపాల్.. మంచి చెప్పాల్సింది పోయి తోటి టీచర్‌ని నమ్మించి మోసం చేశాడు. వివాహం చేసుకోవాలని మహిళ ఒత్తిడితో చేయడంతో తట్టుకోలేకపోయాడు. ఖాళీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత కారు డిక్కీలో మృతదేహాన్ని పెట్టుకుని రోజంతా ట్రావెల్ చేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగు చూసింది. అసలు విషయం తెలిసి అడ్డంగా బుక్కయ్యాడు ప్రిన్సిపాల్.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో మహిళా ఉపాధ్యాయురాలు రాణి హత్య కేసులో కీలక పురోగతి. ఈ కేసులో పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ నిషాద్‌ను అరెస్టు చేశారు పోలీసులు. మహిళా టీచర్‌తో నిందితుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రిన్సిపాల్ విజయ్‌కు వివాహం అయ్యింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ పని చేస్తు్న్న పాఠశాలలో ఓ టీచర్‌ని తన మాయమాటలతో నమ్మించి మోసం చేశాడు.
తనను పెళ్లి చేసుకోవాలని టీచర్ రాణి ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు, కారులో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. సాయంత్రం డియోరియాలోని రుద్రపూర్ ప్రాంతంలోని ఓ పాఠశాల సమీపంలో మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి సైలెంట్ అయ్యాడు. మృతురాలు రాణి విశ్వకర్మ.. గోరఖ్‌పూర్ జిల్లాలోని ఖురుహరి గ్రామానికి చెందినవారు. ఆమె చౌరీ చౌరాలోని వీఎన్ సెంట్రల్ అకాడమీలో ఉపాధ్యాయురాలుగా పని చేశారు. ప్రిన్సిపాల్ విజయ్ నిషాద్ డియోరియా జిల్లాలోని రుద్రపూర్ ప్రాంతానికి చెందినవాడు.
పోలీసుల కథనం ప్రకారం.. అక్టోబర్ 31న ఉదయం 8.30 గంటలకు పాఠశాలకు వెళ్లింది. అక్కడ మరోసారి తన పెళ్లి గురించి విజయ్ దృష్టికి తెచ్చింది. నిందితుడు ఆమెని ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు, అది ఫలించలేదు. ఉదయం సుమారు 9. 15 గంటలకు రాణిని మీఠా బెల్ గ్రామంలోని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకొచ్చాడు. కారు సీటు మధ్యలో కూర్చోపెట్టి రాణి గొంతు నులిమి చంపేశాడు ఆ తర్వాత మృతదేహాన్ని డిక్కీలో పెట్టి ఆ రోజు ఊరంతా తిరిగాడు.
ALSO READ: గృహహింస కేసు పెట్టిన భార్య.. భర్తకు విదేశాల్లో ఉద్యోగావకాశం.. కోర్టు ఏం చెప్పిందంటే
మార్గమధ్యంలో బంకాట్-బైరాగీ ప్రాంతాల మధ్య రాణి మొబైల్ ఫోన్‌ను పగల గొట్టాడు, ఏటీఎం కార్డును పారేశాడు. సాయంత్రం ఓ స్కూల్ సమీపంలో మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు పోలీసులు ఆ మృతదేహాన్ని టీచర్ రాణిగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా విజయ్ నిషాద్‌ను విచారించారు పోలీసులు. నిజాలు ఒప్పేసుకోవడంతో అరెస్టు చేశారు.