Color of Eyes: బ్లాక్, బ్రౌన్, హేజెల్, పిల్లి కళ్లు అంటూ ఒక్కొక్కరికి ఓక్కో రంగు కళ్లు ఉంటాయి. కను గుడ్డు తెలుపు రంగులో ఉన్నట్టు కనుపాప ఎందుకు అందరికీ ఒకే రంగులో ఉండదు అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అసలు ఒక్కో మనిషికి ఒక్కో రకమైన కనుపాప ఎందుకు ఉంటుంది..? వయసు పెరుగుతున్న కొద్దీ కను పాప రంగలో కూడా మార్పులు వస్తాయా అనేది తెలుసుకుందాం..
సాధారణంగా మనిషి జెనెటిక్స్‌ని బట్టే కళ్లు ఏ రంగులో ఉంటాయనేది ఆధారపడి ఉంటుంది. దీనికి మెలనిన్ అనే ఓ పిగ్మెంట్ కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. ఎక్కువ మెలనిన్ ఉన్నవారికి నలుపు, బ్రౌన్ కలర్ కనుపాప ఉండే అవకాశం ఉందట. తక్కువ మెలనిన్ ఉన్నవారికి నీలం, ఆకుపచ్చ లేదా హాజెల్ ఐస్ ఉంటాయి. కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వల్ల కూడా కనుపాపకు మెలనిన్ ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతోంది అనేది ఆధారపడి ఉంటుందట.
రంగు మారుతుందా?
పెరుగుతున్నప్పుడు కంటి రంగు మారుతుందా అంటే అధ్యయనాలు సైతం అవుననే చెబుతున్నాయి. ఇది శిశువులలో ఎక్కువగా కనిపిస్తుందట. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే మెలనిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు పిల్లలు నీలం, ఆకుపచ్చ లేదా హాజెల్ ఐస్‌తో పుట్టే ఛాన్స్ ఉందట. అయితే శిశువు పెరుగుతున్నప్పుడు విడుదల అయ్యే మెలనిన్ శాతాన్ని బట్టి కనుపాప రంగులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
మొదటి 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు, ఐరిస్‌లో మెలనిన్ పరిమాణం పెరుగుతుందట. దీంతో చిన్న పిల్లల కంటి రంగు మారే అవకాశం ఉందని అంటున్నారు. మెలనిన్ లెవెల్స్‌ని బట్టి కనుపాప ముదురు రంగులోకి మారవచ్చు లేదా దాని లేత రంగుల్లో కూడా ఉండొచ్చట. ఆ తర్వాత నుంచి కను పాప రంగు స్థిరంగా ఉంటుంది.
అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం కొంతమంది కళ్ల రంగు వయసు పెరిగే కొద్దీ కూడా మారిపోయే ఛాన్స్ ఉందట. వృద్దుల్లోనే ఇలా జరిగే అవకాశం ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో హార్నర్స్ సిండ్రోమ్ లేదా పిగ్మెంటరీ గ్లాకోమా వంటి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కంటి రంగు మారిపోయే అవకాశం ఉందట.