Digestion| చలికాలం వచ్చిందంటే ఉదయం వేడివేడి టీ, రుచికరమైన పిండి వంటలు గుర్తుకొస్తాయి. అయితే ఈ సీజన్‌లో ఆహారపు అలవాట్లు మారడంతో చాలామందికి గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో ఖరీదైన హెల్త్ డ్రింక్స్ అవసరం లేకుండానే మన వంటింట్లో ఉండే మూడు మసాలాలతో ఓ డ్రింక్ తయారుచేసుకోవచ్చు. దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, తయారుచేసే విధానం తెలుసుకుందాం.
జీలకర్ర (జీరా), వాము, సోంపు.. ఈ మూడు పదార్థాలు భారతీయ వంటింట్లో సాధారణంగా లభిస్తాయి. వీటిని వంటల్లో రుచి కోసం ఉపయోగించడంతోపాటు సంప్రదాయంగా జీర్ణ సమస్యల ఉపశమనానికి కూడా ఉపయోగిస్తారు. న్యూట్రిషనిస్ట్ (పోషకాహార నిపుణురాలు) షాలిని సుధాకర్ ఈ 3 పదార్థాలతో డ్రింక్ తయారుచేసుకోవాలని సూచిస్తున్నారు. దీని తయారీకి ప్రత్యేకమైన పదార్థాలు అవసరం లేదు.
ఈ పానీయాన్ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.
1. ముందుగా జీలకర్ర, వాము, సోంపు తీసుకోవాలి.
2. ఈ మూడింటినీ కొద్దిగా దంచుకోవాలి.
3. ఇప్పుడు 350 మిల్లీలీటర్ల నీటిలో ఈ మిశ్రమాన్ని వేయాలి.
4. ఈ నీటిని బాగా మరిగించి, తర్వాత మంట తగ్గించాలి.
5. నీరు సుమారు 250 మిల్లీలీటర్లకు తగ్గేవరకు మరిగించాలి.
6. అనంతరం వడకట్టి గోరువెచ్చగా లేదా వేడిగా తాగాలి.
విత్తనాలు ముందుగా దంచడం వల్ల వాటిలోని సుగంధ సమ్మేళనాలు నీళ్లలో విడుదలవుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
జీలకర్రలో క్యూమినాల్డిహైడ్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన లక్షణాలపై పరిశోధనల్లో అధ్యయనం చేశారు.
2014లో ప్రచురితమైన ఒక పైలట్ అధ్యయనంలో 57 మంది IBS బాధితులను పరిశీలించారు. జీలకర్ర ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్న కొందరిలో కడుపునొప్పి, ఉబ్బరం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ పరిశోధన జీరా వాటర్‌పై జరగలేదు.
వాములో థైమాల్ అనే సుగంధ సమ్మేళనం ఉంటుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు సంప్రదాయంగా వాము ఉపయోగిస్తారు. న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ ప్రకారం.. వాము, సోంపులో కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడతాయి.
Also Read: మంచి పెర్ఫ్యూమ్ కొనాలని చూస్తున్నారా? మీ పర్సనాలటీకి ఏటి సూట్ అవుతుందో ఇలా తెలుసుకోండి
భోజనం తర్వాత సోంపు నమలడం చాలామందికి అలవాటు. ఇందులో అనెథోల్, ఫెంచోన్, ఎస్ట్రగోల్ వంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి. న్యూట్రిషనిస్ట్ శిల్పా అరోరా ప్రకారం.. వీటికి యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థలోని కండరాలు విశ్రాంతి పొందడానికి సహాయపడతాయి.
Also Read: ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడు ఏఐ కంపెనీ ఓనర్.. ఎలా ఎదిగాడంటే
ఈ పానీయాన్ని ఉదయం నిద్రలేవగానే తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే రోజంతా తగినంత నీరు తాగడం, పీచుపదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం.
ఈ డ్రింక్ సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. తరచూ గ్యాస్, మలబద్ధకం లేదా కడుపునొప్పి వస్తుంటే వైద్యులను సంప్రదించాలి.