AI chatbot divorce controversy| భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. అయితే, ఆ గొడవలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాల్సిన సమయంలో ఓ భర్త ఏకంగా ఏఐ చాట్‌బాట్‌ను ఆశ్రయించాడు. భార్యతో ఎలా ప్రవర్తించాలి? ఆమెతో వచ్చే గొడవలను ఎలా పరిష్కరించుకోవాలి? అంటూ సలహాలు అడిగాడు. కానీ, సమస్య పరిష్కారం కావాల్సింది పోయి మరింత జటిలంగా మారింది. దీంతో బాధితురాలు మహిళా హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. గుజరాత్‌లోని వడోదరలో ఈ ఘటన జరిగింది.
గుజరాత్‌లోని వడోదరకు చెందిన 25 ఏళ్ల మహిళకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ పెళ్లి జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పెళ్లికి ముందు భార్య ఉద్యోగం చేసేది. అయితే, వివాహం తర్వాత ఆమె గృహిణిగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ, భర్త మాత్రం ఆమె మళ్లీ ఉద్యోగంలో చేరాలని కోరుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. గత 6 నెలలుగా ఈ అంశంపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారి వైవాహిక జీవితంలో మనస్పర్థలు పెరిగాయి.
భార్య ఫిర్యాదు ప్రకారం.. గత 2 నెలలుగా భర్త తన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏఐ చాట్‌బాట్‌ను సంప్రదించాడు. చాట్‌బాట్ ఇచ్చిన సూచనలను భార్యతో వ్యవహరించే సమయంలో పాటించేవాడు. అంతేకాకుండా, ఇద్దరి మధ్య జరిగే గొడవలను ఆడియో, వీడియో రూపంలో రికార్డ్ చేయాలని ఏఐ సూచించినట్లు భార్య ఆరోపించింది. దీంతో భర్త వారి మధ్య జరిగే వాదనలను రికార్డ్ చేయడం ప్రారంభించాడు. ఈ పరిణామం భార్యకు మరింత ఇబ్బందిగా మారింది. ఇప్పటికే సమస్యలతో ఉన్న తమ బంధంలో రికార్డింగ్‌లు మరింత ఉద్రిక్తతను పెంచాయని ఆమె తెలిపింది.
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏఐ చాట్‌బాట్ తన భర్తకు విడాకులు తీసుకోవాలని సూచించినట్లు మహిళ ఆరోపించింది. దీంతో భర్త తనకు విడాకులు కావాలని పట్టుబట్టడం ప్రారంభించాడు. అయితే, భార్య మాత్రం తన వివాహ బంధాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించింది. ఇందులో భాగంగా ఆమె వడోదరలోని అభయం మహిళా హెల్ప్‌లైన్‌ను సంప్రదించింది.
Also Read: ప్రతి చిన్న విషయానికి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? కోపంలో ఈ 5 మాటలు అసలు చెప్పకండి
మహిళ ఫిర్యాదుతో అభయం హెల్ప్‌లైన్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇద్దరితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వివాహం వంటి కీలకమైన బంధానికి సంబంధించిన నిర్ణయాలను యంత్రం ఇచ్చే సలహాల ఆధారంగా తీసుకోకూడదని సూచించారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించాలని చెప్పారు. కౌన్సెలింగ్ తర్వాత భార్యాభర్తలు మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవడానికి అంగీకరించారు.
Also Read: భర్తతో శారీరక సాన్నిహిత్యానికి నిరాకరించడం, పిల్లలను దూరం చేయడం మానసిక కృూరత్వం: కోర్టు
ఏఐ చాట్‌బాట్‌లు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సూచనలు అందించగలవు. కానీ, మనుషుల భావోద్వేగాలను, కుటుంబ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోలేవు. ముఖ్యంగా వివాహ బంధానికి సంబంధించిన నిర్ణయాలు ఎంతో ఆలోచించి తీసుకోవాలి.
భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు పరస్పర సంభాషణ, అవగాహన ఎంతో అవసరం. అవసరమైతే నిపుణుల కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. ఏఐ సలహాలు మాత్రమే నమ్మి జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు.