ప్రతి వ్యక్తి ఆలోచనలు, ఇష్టాలు వేరువేరుగా ఉంటాయి. కానీ పెళ్లి అనే పదంతో ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఒక జీవితంలోకి, ఒక ఇంటిలోకి వస్తారు. కాబట్టి వారిద్దరు ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు గౌరవించుకోవాలి. అలాగే ఒకరికి నచ్చిన పనిలో ఇంకొకరు చేయకూడదు. కొంతమంది భార్యలు ఇష్టపడని కొన్ని పనులు ఉన్నాయి. వీటిని ఇష్టపడని భార్యల సంఖ్యా తక్కువేమీ కాదు. కాబట్టి ప్రతి భర్తకు ఈ విషయాలు ఉపయోగపడతాయి.
కలిసి పని చేయండి
ప్రతి భార్యకు భర్త తనకు పనుల్లో సహాయం చేయాలని కోరుకుంటుంది. వంట చేసేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు, ఇల్లు శుభ్రపరిచేటప్పుడు, పిల్లల పనులు చేసేటప్పుడు అన్నింట్లోనూ భర్త సహకారాన్ని కోరుకుంటుంది. మీరు ఎంత సంపాదిస్తున్నా కూడా ఇంటి పనుల్లో సహాయం చేయకపోతే మీ భార్య మిమ్మల్ని అంతగా ఇష్టపడకపోవచ్చు. కాబట్టి కోపం రాకుండా ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తూ ఉండండి.
మీరు ఉదయం నుంచే సాయంత్రం వరకు ఎంత కష్టపడినా అది వేరే విషయం. ఇంటికి వచ్చాక మీ భార్య చేసే పనుల్లో ఏదో ఒక పనిని మెచ్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆమె చేసే వంటలు, ఆమె తయారైన పద్ధతి, ఇంటిని ఆమె శుభ్రపరచిన పద్ధతి… అన్నీ మీరు గమనించి ఏదో ఒక విషయాన్ని మెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీ భార్య మీ ప్రశంసల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లేకుంటే తనను భర్త గుర్తించడం లేదని తనలో తానే కుమిలిపోతుంది. తరచూ అలాంటి వ్యక్తికి కోపం కూడా వస్తుంది. కాబట్టి ప్రశంసించడం మాత్రం మర్చిపోవద్దు.
భార్యాభర్తల బంధానికి ముఖ్యమైనది ఒకరికి ఒకరు సమయాన్ని కేటాయించుకోవడం. ఇంటి పనుల్లో భార్య, ఆఫీస్ పనుల్లో భర్త… బిజీగా మారితే వారి బంధం త్వరగా బలహీనపడుతుంది. ఏ బంధంలో అయినా సమయం కేటాయిస్తేనే ఆ బంధం బలపడుతుంది. కాబట్టి మీ మధ్య తరచూ గొడవలు రాకుండా ఉండాలంటే ఒకరితో ఒకరు ప్రతిరోజు కనీసం గంటైనా మనసు విప్పి మాట్లాడుకోండి. ఒకరి సమస్యలు ఇంకొకరికి చెప్పుకుంటూ ఉండండి. ఇలాంటి పనులు చేయడం ద్వారా మీ భార్యకు మీరు దగ్గర కావచ్చు. మీరు ఆమె కోసం సమయాన్ని కేటాయించకపోతే ఆమె కోపానికి గురవ్వాల్సి వస్తుంది.
ఇతర మహిళల గురించి
ఏ మహిళలైనా వేరే స్త్రీల గురించి పొగిడితే భరించలేరు. కాబట్టి మీరు కూడా ఆఫీసులో అమ్మాయిల గురించి, బయట చూసిన మహిళల గురించి మీ భార్య దగ్గర పొగడడం మానేయండి. వారి వంట బాగుందని, వారి చీరా బాగుందని చెప్పడం తగ్గించుకుంటే ఎంతో మంచిది. లేకుంటే మీ భార్య ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వేరే వాళ్ళతో భార్యను పోల్చడం వారికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అలాగే ఇతర మహిళలు మెచ్చుకోవడం కూడా వారు ఇష్టపడరు. కాబట్టి మీ భార్యల ముందు ఇలాంటి పనులు చేయడం మానేస్తే మీకు ప్రశాంతమైన జీవితం దక్కుతుంది.
Also Read: భార్యాభర్తలు ఎంత కలిసిమెలిసి ఉన్నా ఈ విషయాలు మాత్రం సీక్రెట్‌గానే ఉంచుకోవాలి
చెప్పేది వినండి
సాధారణంగానే మహిళల అధికంగా మాట్లాడతారు. కాబట్టి మీ భార్యకు కూడా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి. ఆమె ఏం చెప్పాలనుకుంటుందో అవి ఓపిగ్గా వినండి. ఆమెను అర్థం చేసుకోకుండా తప్పు పట్టడం వంటివి చేయకండి. కాబట్టి భార్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా ఆమెకు సమయానికి కేటాయించండి.