Actress Ramya:ప్రముఖ సినీ నటి, కర్ణాటక మాజీ ఎంపీ రమ్య (Ramya) కు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అసభ్యంగా మెసేజ్లు చేస్తూ.. ఆమెను మానసికంగా దిగ్భ్రాంతికి గురి చేశారు కొంతమంది దర్శన్ (Darshan)అభిమానులు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా.. ఇప్పుడు ఈ కేసులో ఒక ముందడుగు వేశారు కర్ణాటక పోలీసులు. అందులో భాగంగానే బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ కేసులో దాదాపు 12 మంది దర్శన్ అభిమానులపై ఏకంగా 380 పేజీలతో కూడిన భారీ ఛార్జీషీటును 45వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు.
ఇకపోతే నటి రమ్యపై దర్శన్ అభిమానులు అసభ్యకర మెసేజ్లు చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికొస్తే.. గత కొంత కాలం క్రితం హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అయితే రేణుక స్వామి మృతికి న్యాయం చేకూరాలి అంటూ ఆమె ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే అప్పటినుంచి కొంతమంది దర్శన్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా కామెంట్లు చేశారు. మరి కొంతమంది అత్యంత దారుణంగా లైంగికంగా దాడి చేస్తామంటూ హెచ్చరించారు కూడా.
ఈ నేపథ్యంలోనే రమ్య జూలై 28న బెంగళూరు సీపీ సీమంత్ కుమార్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా తనను వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ వారి అకౌంట్స్ వివరాలను కూడా ఆమె పోలీసులకు అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 12 మందిని అరెస్టు చేయగా.. వీరంతా దర్శన్ అభిమానులే కావడం గమనార్హం. ఇకపోతే ఛార్జీషీట్ లో రమ్య ఇచ్చిన వాంగ్మూలం.. నిందితులు ఒప్పుకోవడం.. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా చేర్చారు. ముఖ్యంగా అరెస్టు అయిన 12 మందిలో నలుగురు జైల్లో ఉండగా.. మిగతావారు బెయిల్ మీద బయటకు విడుదలయ్యారు.
ఇకపోతే ఈ వ్యవహారంపై నటి రమ్య స్పందించారు. ఆమె మాట్లాడుతూ..” సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతోనే.. దర్శన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును గురించి పోస్ట్ చేశాను. మహిళల గొంతుగా ఈ ఫిర్యాదు చేశాను. నాకే ఇలాంటి వేధింపులు ఎదురైతే.. ఇక సాధారణ మహిళలు ఎంత నరకం అనుభవిస్తారో ఊహించగలను. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వారు చట్టాన్ని గౌరవించాలి. తన అభిమానులను కూడా అలాంటి పనులు చేయకూడదు అని సలహాలు ఇవ్వాలి. దర్శన్ కూడా తన అభిమానులతో ఇలాంటి పనులు చేయకూడదని చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటికే అరెస్టు అయిన 12 మందితో పాటు పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు” అంటూ ఆమె తెలిపింది.
also read:Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!