రైల్వే స్టేషన్లలో దొంగతనాలు కామన్ గా జరుగుతుంటాయి. ఎక్కువ మంది దొంగలు కిటికీల దగ్గర ఉన్న ప్రయాణీకులను టార్గెట్ చేస్తారు. విండో పక్కన కూర్చున్న వారి సెల్ ఫోన్లను, ఒంటిమీద బంగారాన్ని లాక్కెళ్తుంటారు. స్నాచింగ్ కు సంబంధించి ప్రయాణీకులలో అవగాహన కల్పించేందుకు రైల్వే పోలీసులు నిత్యం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా, చాలా మంది అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చివరికి సెల్ ఫోన్లు, బంగారం దొంగతనం జరిగిన తర్వాత లబోదిబోమంటున్నారు. తాజాగా రైళ్లలో జరిగే దొంగతనాల గురించి లైవ్ లో చూపించే ప్రయత్నం చేశాడు.. ఓ రైల్వే పోలీసు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) షేర్ చేసిన వీడియోలో.. RPF అధికారి రీతు రాజు చౌదరి నెమ్మదిగా రైలు విండో దగ్గరికి వెళ్తాడు. విండో సీట్ లో ఓ మహిళ కూర్చొని హాయిగా ఫోన్ చూస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఆయన కిటికీలో నుంచి చెయ్యిపెట్టి, ఆమె స్మార్ట్ ఫోన్ ను లాక్కుంటాడు. చౌదరి రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రయాణీకుల నుంచి ఆయా వస్తువులను కొట్టేస్తూ అవగాహన కల్పించే వీడియోలను షేర్ చేస్తుంటాడు. తాజాగా షేర్ చేసిన వీడియోకు “మహిళా ప్రయాణీకురాలిని నిర్లక్ష్యంగా ఉండకూడదని నేర్పించడానికి, RPF అధికారి తగిన గుణపాఠం చెప్పారు. భద్రత కోసం బలగాలు ఉన్నాయి. కానీ, ప్రయాణీకులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే దొంగతనాలకు చెక్ పడుతుంది” క్యాప్షన్ రాశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియో 3.5 మిలియన్ వ్యూస్ సాధించింది. నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చౌదరి చేసిన పని అద్భుతం అంటున్నారు. “ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. మీరు చేస్తున్న పని చాలా అద్భుతంగా ఉంది సర్” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మంచి చొరవ సార్. మీ లాంటి అధికారులు చాలా అరుదుగా కనిపిస్తారు” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు.”నిజమే.. రైలు ఆగిన సమయంలో ఎప్పుడూ సెల్ ఫోన్ వాడకూడదు. ముఖ్యంగా రైలు ప్లాట్ ఫారమ్ పై ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Read Also: మీరు రిజర్వు చేసుకున్న సీట్లో వేరొకరు కూర్చున్నారా? ఇలా చేస్తే సీటు మీకు వచ్చేస్తుంది!
గత కొంత కాలంగా రైళ్లలో మొబైల్ దొంగతానాలు ఎక్కువ అయ్యాయి. ఈ నేరాలను ఎక్కువగా డ్రగ్స్ బానిసలు, వ్యవస్థీకృత ముఠాలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలు కూడా ప్రయాణీకుల నుంచి సెల్ ఫోన్లను దొంగిలిస్తున్నాయి. ప్రభుత్వ రైల్వే పోలీసుల దగ్గర ఉన్న డేటా ప్రకారం, జనవరి 2023 నుంచి మే 2025 మధ్య 26,000 పైగా సెల్ ఫోన్లు దొంగిలించబడ్డాయి. వీటిలో కొన్నింటిని రైల్వే పోలీసులు రికవరీ చేయగా, చాలా వరకు పట్టుకోలేకపోయారు.
Read Also: మెట్రో ప్రారంభమైన 3 రోజులకే గుట్కా మరకలు, మరీ ఇలా తయారయ్యారేంట్రా?