Krishna in Drugs Case: తమిళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ (Drugs)వ్యవహారం కుదిపేస్తోంది. ఇటీవల డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో నటుడు శ్రీరామ్(Sri Ram) ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఇతన్ని అరెస్టు చేసి నుంగంభాకం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే దాదాపు తొమ్మిది గంటల పాటు విచారణ చేసిన పోలీసులు ఈయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈయన ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మరొక నటుడు కృష్ణ (Krishna)కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శ్రీరామ్ డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ కావడంతో నటుడు కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే పోలీసులు బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అజ్ఞాతంలోకి వెళ్లిన కృష్ణ ఎట్టకేలకు పోలీసులకు దొరకడంతో తనని అరెస్టు చేసి నుంగంభాకం పోలీస్ స్టేషన్ కి తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా ఈయన కొంతమంది దర్శకులు నిర్మాతలు పేర్లు కూడా చెప్పినట్టు సమాచారం.
పోలీసుల అదుపులో కృష్ణ..
ఈ విచారణలో భాగంగా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరి పేర్లను బయట పెట్టడంతో ఈ విషయం కాస్త కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే అరెస్టు అయిన శ్రీరామ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈయన విచారణలో భాగంగా మరికొంతమంది పేర్లను కూడా బయట పెట్టారని తెలుస్తుంది. దీంతో డ్రగ్స్ వ్యవహారంలో మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా అరెస్టు అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ వ్యవహారం నడుస్తోందని తెలుస్తోంది.
మత్తు పదార్థాలు అలవాటు చేశారు…
నటుడు శ్రీరామ్ అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ (Prasad)నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోలీసుల అదుపులో ఉన్న ప్రసాద్ శ్రీరామ్ పేరు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు శ్రీ రామ్ ను అరెస్టు చేశారు అయితే ఈ విచారణలో భాగంగా ఆయన చేసిన తప్పులను ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రసాద్ తనకు పది లక్షల రూపాయల వరకు డబ్బులు ఇవ్వాలని, డబ్బులు అడిగిన ప్రతిసారి తనకు కొకైన్ ఇస్తూ మత్తు పదార్థాలకు అలవాటు చేసినట్లు విచారణలో తెలిపారు.
బెయిల్ కోసం అభ్యర్థన..
ఇలా మత్తు పదార్థాలు తీసుకోవడం తప్పేనని ఈయన తప్పును ఒప్పుకున్నారు . అలాగే ఈ విచారణ అనంతరం కోర్టు ఇతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జులై 7 వరకు ఈయనకు రిమాండ్ ఉండగా తనకు బెయిల్ ఇవ్వాలని శ్రీరామ్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన బిడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తన సంరక్షణగా ఉన్న నాకు బెయిల్ ఇవ్వాలి అంటూ ఈయన కోర్టును ప్రాధేయపడ్డారు. ఏది ఏమైనా డ్రగ్స్ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తుంది. మరి ఈ విషయంలో ఇంకా ఎంతమంది సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తాయో తెలియాల్సి ఉంది.