Sonusood: రియల్ హీరోగా పేరు సొంతం చేసుకున్న సోనూసూద్ (Sonusood ) తాజాగా మరొకసారి గొప్ప మనసు చాటుకున్నారు. ముఖ్యంగా తన 52వ పుట్టినరోజు సందర్భంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకొని.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఈ విషయం తెలిసి పలువురు నెటిజెన్లు ఆయనపై ప్రశంసల కురిపిస్తూ.. ఎవరికి సాధ్యం కాని గొప్ప పనులు చేస్తూ.. నిజంగా రియల్ హీరో అనిపించుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోసారి గొప్ప మనసు చాటుకున్న రియల్ హీరో..
అసలు విషయంలోకి వెళ్తే.. తన 52వ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో దాదాపు 500 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎవరూ లేని అనాధలుగా మారిన వృద్ధులకు ఇక్కడ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రధాన లక్ష్యం అని చెప్పుకొచ్చారు. ఇక వయస్సు మీద పడడంతో వారికి కావలసిన ప్రేమానురాగాలు.. ఎమోషనల్ సపోర్టు ఇక్కడ అందిస్తామని, ముఖ్యంగా ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వైద్య సంరక్షణ, పోషకాహారం కూడా అందిస్తామని సోనూ సూద్ స్పష్టం చేశారు. త్వరలోనే వృద్ధాశ్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ విషయం తెలిసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సోనూసూద్ సినిమాలు..
ఇక సోనూసూద్ విషయానికి వస్తే సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో ఒక మార్క్ క్రియేట్ చేసిన ఈయన.. అరుంధతి సినిమాతో విలన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో “వదల బొమ్మాలి వదలా” అనే డైలాగ్ తో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న ఈయన.. ఆ తర్వాత పలు చిత్రాలలో విలన్ గా నటిస్తూ మరింత ఇమేజ్ దక్కించుకున్నారు. సినిమాలలో విలన్ పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న ఈయన నిజజీవితంలో అందరికీ సహాయపడుతూ అండగా నిలుస్తున్నారు.. అందుకే ఏ హీరోకి దక్కని “రియల్ హీరో” అనే ట్యాగ్ సోనూ సూద్ కి లభించింది అని చెప్పవచ్చు.
కరోనా సమయం నుంచే వెలుగులోకి..
ఇండస్ట్రీకి రాకముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు ఎంతో మందికి అందించారట. కానీ కరోనా సమయంలోనే ఆయన సహాయం బయటకు వచ్చిందని సమాచారం. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమందికి అండగా నిలిచారు. ఉద్యోగం లేని వారికి ఇంటి నుండి ఉద్యోగం చేసుకునేలా అవకాశం కల్పించారు. వలస కూలీలను సొంత ఖర్చులతో తమ సొంత ఇంటికి పంపించి, గొప్ప మనసు చాటుకున్నారు. ముఖ్యంగా అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లను అందివ్వడమే కాకుండా చాలామందికి ఆహార పదార్థాలను కూడా ఉచితంగా పంచిపెట్టారు సోనుసూద్. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ వారికి సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. రైతులకు , అమ్మాయిలకి కూడా అండగా నిలిచారు.
మానవతావాది అవార్డు అందుకున్న సోనూసూద్..
ఇలా ఎన్నో సామాజిక సేవలు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ వేడుకలు ప్రతిష్టాత్మక మానవతావాది అవార్డు కూడా ఆయన అందుకున్నారు. ఇలా ఎప్పటికప్పుడు మంచి కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారని చెప్పవచ్చు.
ALSO READ: Film industry: ‘పవర్ స్టార్’ అరెస్ట్.. రూ.1000 కోట్ల డీల్ అంటూ!