Satya Krishnan:తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సత్యకృష్ణన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఆనంద్’, ‘బొమ్మరిల్లు’, ‘వినాయకుడు’, ‘దేవదాస్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి ఎన్నో చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనంద్’ సినిమాలో ఆమె చెప్పిన ‘నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు’ అనే డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అయితే ఒకప్పుడు హోటల్ ఉద్యోగం చేసిన ఆమె అనుకోకుండా నటిగా మారిన విషయం చాలామందికి తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.
సత్యకృష్ణన్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎయిర్ హోస్టెస్ కావాలని కలలు కన్నారు. అయితే ఆ తర్వాత హైదరాబాద్‌లోని తాజ్ గ్రూప్ హోటల్స్‌లో ఫ్రంట్ ఆఫీస్ విభాగంలో ఉద్యోగంలో చేరారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల బృందంలోని కో ప్రొడ్యూసర్ సునీత ఆమెను గమనించారు. అనంతరం ఆడిషన్‌కు రావాలని ఆహ్వానించారు.
అప్పట్లో తనకు అసలు ఆడిషన్ అంటే ఏమిటో కూడా తెలియదని సత్యకృష్ణన్ గుర్తుచేసుకున్నారు. ఓ స్నేహితుడిని వెంట తీసుకుని బైక్‌పై ఆడిషన్‌కు వెళ్లానని తెలిపారు. అక్కడ ఒక డైలాగ్ ఇచ్చి, దానిని తనదైన శైలిలో చెప్పాలని సూచించారట. ఆమె నటన నచ్చడంతో వెంటనే సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా 2000లో విడుదలైన ‘డాలర్ డ్రీమ్స్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.
తొలి సినిమా తర్వాత వివాహం చేసుకున్న సత్యకృష్ణన్ కొంతకాలం నటనకు దూరమయ్యారు. పంజాగుట్టలోని బీఎన్‌పీ పారిబాస్ బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. అయితే నాలుగేళ్ల తర్వాత శేఖర్ కమ్ముల మరోసారి ఆమెను సంప్రదించారు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆనంద్’ సినిమాలో అనిత పాత్రను పోషించే అవకాశం కల్పించారు.
ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించడంతో పాటు నంది అవార్డు కూడా దక్కింది. దీంతో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో నటనపై దృష్టి పెట్టారు.
also read:ఎల్లమ్మ మూవీకి విలన్ దొరికేసినట్టేనా?
‘ఆనంద్’ సినిమాతో వచ్చిన గుర్తింపుతో సత్యకృష్ణన్‌కు వరుస అవకాశాలు వచ్చాయి. ‘బొమ్మరిల్లు’, ‘వినాయకుడు’, ‘దేవదాస్’, ‘దూకుడు’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. చిన్న పాత్ర అయినప్పటికీ తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఒక సాధారణ హోటల్ ఉద్యోగినిగా జీవితాన్ని ప్రారంభించి, వెండితెరపై గుర్తింపు పొందిన నటిగా ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
https://www.instagram.com/sathya_krishnan27/p/DfpD3I3GQ1N/?hl=en