Shoba Tragedy : సినిమా ఇండస్ట్రీలో కనిపించే గ్లామరే కాదు..కనించని ట్రాజెడీ కూడా ఉంటుంది. ముఖ్యంగా తెరమీద మెరిసిపోయే తారల వెనుక ఎన్నో కన్నీటి కథలు దాగి ఉంటాయి.అదిగో అలాంటి ఓ కన్నీటి కథే నటి శోభది. తనకంటూ ఓ గుర్తింపు రావాలన్న తపనతో కేవలం చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగెట్టిన శోభ ఎంత త్వరగా స్టార్ గా ఎదిగిందో, అంతే త్వరగా అంటే కేవలం 17 ఏళ్లకే తన ప్రస్థానాన్ని ముగించేసింది.మరి అలనాటి ఈ అందాల తార వెనుకున్న ఆ చీకటి కోణమేంటో ఓసారి చూసేద్దామా !
కేవలం నాలుగేళ్ల వయసులోనే
మద్రాసులోని ఒక మలయాళ కుటుంబంలో 1962 సెప్టెంబర్ 23న జన్మించింది శోభ. ఆమె అసలు పేరు మహాలక్ష్మి మీనన్. తల్లి ప్రేమ కూడా మలయాళ నటి కావడంతో, శోభకు చిన్నతనంలోనే నటనపై ఆసక్తి కలిగింది. అలా కేవలం నాలుగేళ్ల వయసులోనే ‘తట్టుంగళ్ తిరక్కపాడుం’ (1966) అనే తమిళ సినిమాతో బాలనటిగా కెమెరా ముందుకు ఎంట్రీ ఇచ్చింది.ఇక ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వెనక్కి తిరిగి చూసుకోకుండా కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేసింది.ముఖ్యంగా మన చిరు తొలినాళ్ళలో నటించిన ‘మన ఊరి పాండవులు’ (1978) సినిమాలో శోభ తళుక్కుమన్నసంగతి తెల్సిందే.
1978-79 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్
అలా సినిమాలు చేసుకుపోతున్న శోభ జీవితంలో 1978-79 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. 1978లో వచ్చిన ‘ఉత్రాడ రాత్రి’ అనే మలయాళ సినిమా ఆమెకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఇక అదే ఏడు రజనీ హీరోగా వచ్చిన ‘ముల్లుమ్ మలరుమ్’ సినిమాలో చెల్లెలి పాత్రలో అయితే జీవించేసింది. ఇక కమల్ హాసన్‌తో కలిసి ఆమె చేసిన ‘నిళల్ నిజమగిరదు’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడమే కాకుండా వారి పెయిర్ కి మంచి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. అయితే వీటన్నిటింటి కన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా 1979లో వచ్చిన ‘పసి’ (Pasi).మురికివాడలో చెత్త ఏరుకుంటూ, పెళ్ళైన వ్యక్తి వలలో పడి మోసపోయే ‘కుప్పమ్మ’ పాత్రలో శోభ పరకాయ ప్రవేశమే చేసింది. ఎంతలా అంటే కేవలం 17 ఏళ్ల వయసులోనే నేషనల్ అవార్డ్ కొట్టేసెంత.ఇక ఇప్పటి వరకు శోభ తర్వాత ఇంత చిన్న వయసులో మరే నటి కూడా జాతీయ అవార్డు దక్కించుకోకపోవడం గమనార్హం.సినిమాని రియల్ లోకేషన్లలోనే షూట్ చేయడం కూడా బాగా కలిసి వచ్చింది.
also read :ఒక్క వీడియోతో సీన్ రివర్స్.. ఆర్జే బాలాజీ ‘బిగ్ ప్లాన్’ అట్టర్ ఫ్లాప్!
శోభ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన బాలు మహేంద్ర
అతి కెరీర్ పరంగా దూసుకుపోతున్న శోభ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు బాలు మహేంద్ర .శోభ, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన కోకిల (1977) సినిమానే దర్శకుడిగా బాలు మహేంద్రకి మొదటిది. ఇదే సినిమాకి బాలు మహేంద్రకి సినిమాటోగ్రఫీలో నేషనల్ అవార్డు దక్కింది కూడా.ఇక ఈ సినిమా చేస్తున్నప్పుడే శోభతో ఆయనకు పరిచయం ఏర్పడింది.కానీ అప్పటికే ఆయనకు అఖిల అనే మహిళతో పెళ్లి జరిగింది. అయినప్పటికీ శోభతో మొదలైన పరిచయం కాస్తా మెల్లిగా ప్రేమగా మారింది. ఇక శోభ నటించిన ముల్లుమ్ మలరుమ్ (1978),పాసి (1979)సినిమలాకి కూడా బాలూనే సినిమాటోగ్రఫీ కావడంతో ఆ ప్రేమ కాస్తా ముదిరి పెళ్లి దాకా వచ్చింది. అయితే శోభ కంటే 26 ఏళ్లు పెద్దవాడు కావడం, అప్పటికే బాలూకి పెళ్లై పిల్లలు ఉండటంతో వాళ్ళ పెళ్ళికి శోభ తల్లి ససేమిరా అంది,కాని విధి ప్లాన్ మరోలా ఉంది. తల్లి ఎంత వద్దని చెప్పినా వినని శోభ 1978లో బాలు మహేంద్రను పెళ్లి చేసుకుంది.అదిగో పడ్డ ఆ మూడు ముళ్ళే ఆమె కొంపముంచాయి. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది.బాలు మహేంద్ర తన మొదటి భార్యను వదిలేసి తనతోనే ఉంటారని శోభ ఆశ పడింది.కానీ అది అత్యాశ అన్న విషయం ఆమెకి త్వరగానే అర్థమయింది. ఒక వైపు బాలు తనకి పట్టించుకోకపోవడం, వారి కుటుంబంలో జరిగిన గొడవలు శోభని బాగా కుంగదీశాయి.
17 ఏళ్ల 7 నెలల చిన్న వయసులో మృతి
చివరకు 1980 మే 1వ తేదీన, తన 18వ పుట్టినరోజుకు కూడా జరుపుకోకుండానే (17 ఏళ్ల 7 నెలల వయసులో) శోభ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మే 1వ తేదీన శోభ ఉరి వేసుకోవడానికి కొన్ని గంటల ముందు కూడా బాలూ తో పెద్ద గొడవ జరిగిందని సమాచారం. తన మొదటి భార్య దగ్గరికి వెళ్లకుండా తనతోనే ఉండాలని శోభ పట్టుబట్టిందని,దానికి అతను ఒప్పుకోకపోవడం తోనే అలాంటి నిర్ణయం తీసుకుందన్న వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. అయితే శోభ ఆమె గదిలో ఉరివేసుకుని కనిపించిన తీరుపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో అది ఆత్మహత్యే అని తేలినప్పటికీ, ఆమె తల్లి ప్రేమా మీనన్ మాత్రం తన కూతురి మరణానికి బాలు మహేంద్రే కారణమని కోర్టు మెట్లెక్కారు కూడా.
‘మూన్డ్రామ్ పిరై’సినిమా ఆమె జ్ఞాపకార్థమే
ఇక శోభ చనిపోయిన తర్వాత కూడా ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. అందులో భాగ్యరాజ్ జోడీగా నటించిన ‘మౌన గీతంగళ్’ పెద్ద హిట్ అయ్యింది. అలాగే ఆమె జీవితాధారంగా మలయాళంలో ‘లేఖయుడె మరణం ఒక ఫ్లాష్ బ్యాక్’ అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది కూడా ఇక ఆమె మరణం తర్వాత బాలు మహేంద్ర ‘మూన్డ్రామ్ పిరై’ (తెలుగులో ‘వసంత కోకిల’) సినిమాను ఆమె జ్ఞాపకార్థమే తీశారని, ఆ సినిమా క్లైమాక్స్‌లో కమల్ హాసన్ పడే వేదన శోభను కోల్పోయిన తన బాధేనని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా, వెండితెరపై మరెన్నో అద్భుతమైన పాత్రలు వేయాల్సిన శోభ ఇలా అర్థాంతరంగా కన్ను మూయడం బాధాకరం !
also read :CM విజయ్ ‘మాస్’ డెసిషన్.. 717 వైన్ షాపులు ఖాళీ..హీరో విశాల్ రియాక్షన్ వైరల్!