Good Bad Ugly: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్ కు నెట్ ఫ్లిక్స్ షాక్ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను డిలీట్ చేసింది. దానికి కారణం మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా. గత కొంతకాలంగా ఇళయరాజా తన పర్మిషన్ లేకుండా తన సాంగ్స్ ను కానీ, మ్యూజిక్ ని కానీ వేరే సినిమాల్లో వాడితే వారిపై లీగల్ గా కేసులు వేస్తున్న విషయం తెల్సిందే.
ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విషయంలో నెట్‌ఫ్లిక్స్ తో ఇళయరాజా పెద్ద కాపీరైట్ వివాదం లో చిక్కుకున్నారు. ఈ సినిమాలో కొన్ని పాత సినిమాల పాటలను తన అనుమతి లేకుండా వాడినట్లు ఇళయరాజా తెలిపారు. ఆయన సృష్టించిన మ్యూజిక్ లోని మూడు పాటలను, పైగా ఆయనే హక్కులు కలిగిన పాటలను, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. అనుమతిలేకుండా వాడినట్లు ఆరోపించారు. ఈ విషయంపై ఇళయరాజా నిర్మాతల నుండి క్షమాపణలు, అలాగే 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం డిమాండ్ చేశారు.
ఇక ఈ వివాదం పై మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా స్పందించింది. మొదట ఇళయరాజా అంగీకరించిన మ్యూజిక్ కంపెనీ అనుమతితోనే పాటలు వాడినట్లు వాదించిన మైత్రీ కోర్టుకు సంబంధిత ఆధారాలు అందించలేకపోయారు. కాపీరైట్ నిబంధనలు ప్రకారం, ఒక సంగీత దర్శకుడు పాటలను వాడటానికి ముందుగా అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ ఇళయరాజా ఇచ్చిన ఆరోపణలు, మరియు మైత్రీ మూవీ మేకర్స్ ఆధారాలు సమర్పించకపోవడంతో వివాదం మరింత ముదిరింది.
ఇక మద్రాస్ హైకోర్టు ఈ కేసును విచారించి సంచలన తీర్పు ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ నుంచి వెంటనే ఈ సినిమాను తొలగించాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చేసేదేమి లేక నెట్ ఫ్లిక్స్.. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను తమ ఓటీటీ నుంచి తొలగించింది. ఇక అజిత్ హీరోగా అధిక రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తమిళ్ లో అజిత్ ఫ్యాన్స్ ను మెప్పించినా.. తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ నుంచి కూడా తొలగించడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.