Amrutham Serial:‘అమృతం’..ఈ సీరియల్ చూడని 90s కిడ్స్ ఉండరంటే ఆశ్చర్యం లేదు. ఎంత కాలం గడిచినా, తరాలు మారినా అమృతం సీరియల్‌కు ఇంకా క్రేజ్ తగ్గలేదన్నది వాస్తవం.అయితే ‘అమృతం’మనం చూసినంత ఈజీగా తెరపైకి రాలేదని దాని వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయని తాజాగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమా సందర్భంగా చెప్పుకొచ్చారు గున్నం గంగరాజు .
ఈ సందర్భంగా గున్నం గంగరాజు మాట్లాడుతూ 1970-80లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగం అంటే ఎంతో గౌరవం, సెక్యూరిటీ ఉండేదని కానీ తను మాత్రం ఆ ఉద్యోగాన్ని ఏడాది లోపే వదిలేశానని చెప్పుకొచ్చారు. బ్యాంకింగ్ ఫీల్డ్ లో పెద్ద స్థాయికి వెళ్లే ఆసక్తి తనకు లేదని, జీవితాంతం ఒకే పని చేస్తూ కూర్చోవడం తన వల్ల కాదని అర్థమైందని చెప్పుకొచ్చారు.
ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలో కూడా తెలీదని సినిమాలపై ఇష్టం ఉన్నా వెంటనే అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చాడు. దాంతో రైటింగ్, డిజైనింగ్ మీద ఉన్న ఆసక్తితో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మొదలుపెట్టానని అలా ఓ ఐదారు ఏళ్లు అక్కడ పనిచేశామని ఆ బిజినెస్‌లోనూ సరైన రిజల్ట్ రాకపోవడంతో చివరకు డిజైన్ స్టూడియోను పెట్టామని తెలిపాడు.
ఇక ‘అమృతం’ వెనుక జరిగిన కథ గురించి చెబుతూ మొదట్లో టీవీ సీరియల్స్ మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా చేయాలనే ఆలోచనతో డైలీ సీరియల్ కాకుండా వారానికి ఒకసారి వచ్చే కామెడీ షో చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఎనిమిది ఎపిసోడ్లు తీసినా ముందు ఈటీవీ, జెమినీ ఛానెల్స్ నుంచి ఆశించిన స్పందన రాలేదని చివరకు జెమినీలో స్లాట్ తీసుకుని సొంతంగా ప్రసారం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ప్రతి వారం టెలీకాస్ట్ కి డబ్బులు కట్టాలని ,మరోవైపు యాడ్స్ తెచ్చుకోవాలని , అప్పట్లోనే ఒక్కో ఎపిసోడ్ నిర్మాణానికి లక్ష రూపాయలకు పైగా ఖర్చయ్యేదని, ఇతర సీరియల్స్‌తో పోలిస్తే తమ షూటింగ్‌కు ఎక్కువ సమయం పట్టేదని ఆయన వివరించారు.
ఇలా మూడేళ్ల పాటు అష్టకష్టాలు పడ్డామని, అయితే సీరియల్‌కు జనాలు బాగా కనెక్ట్ అవుతున్నా, యాడ్స్ ఆదాయం రాకపోవడం పెద్ద సమస్యగా మారిందని చెప్పుకొచ్చారు. చివరకు మూడో ఏడాదిలో ముంబై నుంచి వచ్చిన ఒక మార్కెటింగ్ పర్సన్ తమ సీరియల్ టీఆర్పీ లెక్కలు చూసి, అడ్వాన్స్‌తో పాటు ఒక్కో ఎపిసోడ్‌కు ఒక అమౌంట్ ఇస్తామని చెప్పడంతో పరిస్థితుల్లో మార్పు వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
ఇక అమృతం అనే పేరు రావడం వెనుక కథ చెబుతూ మొదట రైటింగ్ కోసం రచన కోసం ఒక పెద్ద రైటర్ ని కలసినప్పుడు స్క్రిప్ట్, పాత్రల పేర్లు తనకు అనుకున్నంత స్థాయిలో నచ్చలేదని ,దాంతో పాత్రల పేర్లను మార్చి, కథని మరింత బెటర్ గా రాసే క్రమంలో ‘అమృతం’ టైటిల్ వచ్చిందని ఆరోజుల్ని గుర్తు చేసుకున్నారు.
అయితే అమృతం రెండో భాగం చేసేటప్పుడు తాము పోటీ పడింది మరో సీరియల్‌తో కాదని, ప్రేక్షకుల చిన్ననాటి జ్ఞాపకాలతోనని ఆయన చెప్పడం విశేషం. ఇక ఇప్పుడు 30-40 ఏళ్ల వయసులో ఉన్నవాళ్లకు అమృతం అనేది కేవలం ఒక కామెడీ సీరియల్ కాదని, వాళ్ల బాల్యానికి, కుటుంబంతో కలిసి టీవీ చూసిన రోజులకు సంబంధించిన జ్ఞాపకమని, అలాంటి నాస్టాల్జియాతో పోటీపడి అదే స్థాయి ఫీల్‌ను మళ్లీ అందించడం చాలా కష్టమని ఆయన తన మనసులోని మాటల్ని బయటపెట్టారు !
ALSO READ:అవనీత్ కౌర్ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. లేటెస్ట్ పోస్ట్ వైరల్!