OG Premiere : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు హీరోగా.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ కి డీసీఎంగా బాధ్యతలు చేపట్టి బిజీగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా అధికారాన్ని కొనసాగిస్తూనే.. ఇంకొక వైపు అభిమానుల కోసం సినిమాలు చేస్తూ ఆ ముచ్చట కూడా తీరుస్తున్న విషయం తెలిసిందే. తీరిక సమయాలలో సినిమా షూటింగ్లలో పాల్గొంటూ నిత్యం శ్రామికుడిలా ముందుకు సాగుతున్నారు. అలాంటి ఈయన ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు సుజీత్ (Sujith) దర్శకత్వంలో ‘దే కాల్ హిమ్: ఓజీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కాబోతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan)హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా విషయంలో అటు థియేటర్ యాజమాన్యం ఇటు అభిమానులలో గందరగోళం ఏర్పడింది. దీనికి కారణం ప్రీమియర్ షో అనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో పుష్ప 2, హరిహర వీరమల్లు లాంటి పెద్ద సినిమాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒకే సమయంలో ప్రీమియర్ షో నిర్వహించారు. కానీ ఓజీ సినిమా విషయంలో ప్రీమియర్ షో టైమింగ్ మారడంతోనే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఏ సమయంలో టికెట్ బుక్ చేసుకోవాలో కూడా తెలియక గందరగోళంలో పడిపోయారు.
also read:Dharmavarapu Subramanyam: చనిపోయి 12 ఏళ్ళైనా తీరని చివరి కోరిక.. ఏంటంటే?
తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా..
అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 25న తెల్లవారుజామున 1:00 గంటకు ఓజీ సినిమా ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయి. అయితే అటు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో ప్రారంభించడానికి అనుమతులు లభించాయి. ఈ తేడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్ యజమానులలో అలాగే ప్రేక్షకులలో అనిశ్చితిని సృష్టించింది. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రీమియర్ షో టైమింగ్ సవరించి ఎప్పుడైనా ఉత్తర్వులు జారీ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నా.. ప్రకటన వెలువడే వరకు అభిమానులలో సందిగ్ధత పోదు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వ ఉత్తర్వులలో మార్పు ఉంటుందా?
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని థియేటర్లు ఇప్పటికే ఒంటిగంట షోల కోసం బుకింగ్లను ప్రారంభించాయి. ఒకవేళ తెలంగాణలో లాగా ఇక్కడ ఆంధ్రాలో కూడా సెప్టెంబర్ 24న రాత్రి ప్రీమియర్లను అనుమతిస్తే వాటిని మళ్లీ షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రేక్షకులు కూడా ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకోవాలో లేదో అని కచ్చితంగా తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఈ గందరగోళాన్ని నివారించాలి అంటే నిర్మాతలు జోక్యం చేసుకొని పరిస్థితిని త్వరగా స్పష్టం చేయాలి అని కూడా కోరుతూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ విషయంలో టికెట్లు కొనాలా వద్దా అని ఆంధ్రప్రదేశ్ లోని పవన్ కళ్యాణ్ అభిమానులు సందిగ్ధంలో పడిపోయారు. మరి దీనిపై అటు నిర్మాతలు.. ఇటు ప్రభుత్వం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.