ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీ వేదికగా ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన తీవ్ర వ్యాఖ్యలు సభ్యులను షాక్ కు గురిచేశాయి. ప్లాస్టిక్ కాలుష్యంపై గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానమిచ్చారు. ఈ అంశంపై బొండా ఉమా అనుబంధ ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ కృష్ణయ్యపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. దీంతో పాటు పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించారు.
ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఛైర్మన్ వద్దకు వెళ్తే డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారని, డిప్యూటీ సీఎం చేయొద్దన్నారని, ఆయన ఆఫీసు నుంచి మాకు చెప్పాలని అంటున్నారని బొండా ఉమా వ్యాఖ్యానించారు. పీసీబీ పని చేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదని విమర్శలు చేశారు. తనలాంటి ఎమ్మెల్యేలు గెలిస్తేనే పీసీబీ ఛైర్మన్ గా ఆయన సీట్లో కూర్చున్నారని, ఆయన పెద్ద పెద్దవాళ్లకు ఏవిధంగా ప్రభావితం అవుతున్నారో తెలియదన్నారు. ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించడంలో పీసీబీ పూర్తిగా విఫలమవుతుందన్నారు. ఇలాంటి వాళ్లను ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరిదిద్దాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వీరిద్దరూ అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు.
‘విశాఖలోని రాంకీ పరిశ్రమ ఫార్మా వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తుందని పీసీబీ ఛైర్మన్ చెప్పారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చినా చర్యలు లేవు. ఆ కంపెనీ యజమాని వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి ఏ లెవల్ లో ప్రభావితం చేస్తున్నారో తెలియడంలేదు. ఇప్పటికైనా పవన్ కల్పించుకుని పీసీబీ అధికారులు పనిచేసే విధంగా గట్టిగా మందలించాలి’ అని బొండా ఉమా అన్నారు.
ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. బొండా ఉమా వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయన్నారు. వ్యక్తిగత ఉద్దేశాలతో ఆయన మాట్లాడినట్లు అనిపిస్తోందన్నారు. ఒక ఎమ్మెల్యే ఈ విధంగా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని అధికారులను ఆరా తీశారు. అయితే ఫిబ్రవరిలో క్రెబ్స్ బయో కెమికల్స్‌పై ఎమ్మెల్యే బొండా ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారన్నారు. ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇస్తే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అధికారులను ఆదేశించినట్లు పవన్ తెలిపారు.
పరిశ్రమలపై ఈ తరహా బెదిరింపులు సరికాదని పవన్ అన్నారు. పరిశ్రమలు పారిపోయే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకురాదని చెప్పారు. కూటమి పాలనలో గత ప్రభుత్వ విధానాలు కుదరవన్నారు.
ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలు, పీసీబీ అధికారుల వివరణపై సీఎంవో ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని పీసీబీ అధికారులను సీఎంవో ఆదేశించినట్లు సమాచారం.
Also Read: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!
సోషల్ మీడియాలో జనసైనికులు ఎమ్మెల్యే బొండా ఉమా తీరుపై ఫైర్ అవుతున్నారు. పరిశ్రమ వల్ల కాలుష్యం జరుగుతుందని ముందు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత పీసీబీ చర్యలకు ఉపక్రమిస్తే మళ్లీ ఆయనే అడ్డుపడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. బొండా ఉమా వ్యాఖ్యలతో కూటమిలో కుంపటి మొదలైందని వైసీపీ మద్దతుదారులు ట్వీట్లు పెడుతున్నారు.