Athadu Rerelease: ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల కంటే పాత సినిమాల రీరిలీజ్ లే ఎక్కువ హైప్ తెచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు హిట్ అయిన సినిమాలు.. స్టార్ హీరోల బర్త్ డేలకు గిఫ్ట్ గా మేకర్స్ రిలీజ్ చేసి మరిన్ని డబ్బులు సంపాదిస్తున్నారు. అభిమానులు సైతం .. తమ అభిమాన హీరోల సినిమాలు అనగానే థియేటర్ లో రచ్చ చేస్తున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఆగస్టు 9 న మహేష్ బాబు బర్త్ డే కావడంతో మేకర్స్ అతడు సినిమాను 4కె ఫార్మాట్ లో రీరిలీజ్ చేస్తున్న విషయం తెల్సిందే.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మురళీ మోహన్ నిర్మించిన ఈ సినిమా 2005లో రిలీజ్ అయ్యింది. అయితే ఆ సమయంలో అతడు సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ, టీవీ లో అతడు హిట్ అయ్యినంతగా ఇంకే సినిమా హిట్ అవ్వలేదు అని చెప్పొచ్చు. ఇక దాదాపు 20 ఏళ్ళ తరువాత అతడు సినిమా రీరిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈమధ్యనే మురళీ మోహన్ ప్రెస్ మీట్ పెట్టి.. అప్పటి సినిమా విషయాలను పంచుకున్నాడు.
ఇక అతడు రీ రిలీజ్ సరికొత్త రికార్డును సాధించింది. ఓవర్సీస్ లో అతడు అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్మురేపింది. ఇంకారిలీజ్ కు వారం రోజులు ఉండగానే రూ. కోటి మార్క్ దాటింది. రిరిలీజ్ సినిమాల్లో కోటి రూపాయలు మార్క్ దాటిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. కేవలం ఓవర్సీస్ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అతడు రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమాను నైజాంలో ఏషియన్ సునీల్ రిలీజ్ చేస్తుండగా.. సుదర్శన్ 35, దేవిలో అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రీరిలీజ్ థియేట్రికల్ రైట్స్ హక్కులు రికార్డ్ స్థాయిలో 3 కోట్లకు పైగా ధర పలికినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో మహేష్ బాబునా.. మజాకానా.. అది ఆయన రేంజ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
ఇక అతడు సినిమా కథ గురించి చెప్పాలంటే.. నందు (మహేష్ బాబు) ఒక ప్రొపెషనల్ కిల్లర్. కాబోయే ముఖ్యమంత్రి శివారెడ్డి( షియాజీ షిండే)ని చంపిన కేసులో అతడిని పోలీసులు వెతుకుతూ ఉంటారు. వారినుంచి తప్పించుకోవడానికి సత్యనారాయణమూర్తి(నాజర్) మనవడు పార్థు( రాజీవ్ కనకాల) ఇంట్లో నుంచి పారిపోతే.. అతని ప్లేస్ లో ఆ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ కుటుంబానికి దగ్గరవుతాడు. తన వలన పార్థు చనిపోవడంతో.. ఆ కుటుంబానికి మనవడుగానే ఉండాలని అనుకుంటాడు. ఈలోపు నందును వెతుకుంటూ సిబిఐ ఆఫీసర్స్ వస్తారు. వారి బారి నుంచి నందు ఎలా బయటపడ్డాడు..? అసలు శివారెడ్డిని చంపింది ఎవరు.. ? నందును పార్థుగా సత్యనారాయణ మూర్తి కుటుంబం ఒప్పుకుందా.. ? అనేది సినిమా కథ. మరి ఈ సినిమాకు థియేటర్ లో మహేష్ ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారో చూడాలి.