Yellamma Movie : బలగం.. ఇదో చిన్న సినిమా అని అనడానికి ఎవరూ ఒప్పుకోరు. ఎందుకంటే, ఈ మూవీ ఎన్నో పెద్ద కుటుంబాలను కలిపింది. తెలంగాణ పల్లెటూళ్లలో జనాలకు వాళ్ల బలగాన్ని వాళ్లకే పరిచయం చేసింది. అన్నదమ్ముల ఆప్యాయతను చూపించింది. తోబుట్టువుల బంధాన్ని చూపించింది. పల్లె అందాలను చూపించింది. పల్లె అనుబంధాలను చూపించింది. వారి మధ్య కల్మషం లేని మనసులను వెండితెరపై చూపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అందులో.
అంతటి గొప్ప సినిమాను అందించిన వేణు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ఇప్పుడు వేణు తెలంగాణ పల్లెటూళ్ల నేపథ్యంలో మరో కథను రెడీ చేసుకున్నాడు. దాని పేరే “ఎల్లమ్మ”. సినిమా గురించి చెప్పిన తర్వాత బలగం మూవీని చూసి ఆదరించిన వారంతా… ఇప్పుడు ఎల్లమ్మ కోసం ఎదురుచూస్తున్నారు.
సినిమా రిలీజ్ అవ్వకముందే… ఇంకా చెప్పాలంటే, షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఎల్లమ్మ సినిమాపై ఓ రకమైన బజ్, హైప్ క్రియేట్ అయింది. కానీ, ఇది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. దాదాపు రెండేళ్ల నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి మీన మేషాలు లెక్కిస్తూనే ఉంది. ఎంత లేట్ అయినా… సినిమాపై నమ్మకం ఉండేది. కారణం దిల్ రాజు. నిజామాబాద్ కి చెందిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ సరిగ్గా డీల్ చేయగలడు అనే నమ్మకం.
వేరే వేరే హీరోల దగ్గరకు వెళ్లిన ఈ మూవీ లాస్ట్ కి నితిన్ చేతిలోకి వచ్చి పడింది. అంతా ఒకే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అనుకున్నారు. అంతలోనే నితిన్ తమ్ముడు మూవీ బిగ్ డిజాస్టర్ అయింది. దీంతో నితిన్ చేతిలో ఈ మూవీని పెట్టలేమని అనుకున్నారేమో నిర్మాత… లేదా నితిన్ ఈ టైంలో ఈ సినిమాకు తనకు సెట్ అవ్వదని అనుకున్నాడో.. తెలీదు కానీ, ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు హీరో నితిన్ లేడంట.
ఇంకెముంది… మునుపటి లానే, హీరో కోసం మళ్లీ సెర్చింగ్. ఇప్పటికే ఈ మూవీ నాని, నితిన్‌తో పాటు మరో హీరో దగ్గరకు వెళ్లింది. వాళ్లు రిజెక్ట్ చేశారట. ఇప్పుడు నితిన్ కూడా రిజెక్ట్ చేయడంతో హీరో సెర్చింగ్ పనులు మళ్లీ మొదలయ్యాయి.
శతమానం భవతి అనే ఆంధ్ర ప్రదేశ్ పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన సినిమాలో హీరోగా చేసి మంచి మార్కులు కొట్టిన శర్వానంద్ వరకు ఈ ప్రాజెక్ట్ వెళ్లిందట. శర్వానంద్‌కు దిల్ రాజుకు మంచి సన్నిహిత్యం ఉంది. అందువల్ల శర్వానంద్ కి ఈ మూవీ స్టోరీ వినిపించారట. అయితే ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదని సమాచారం.
ఇలా… వరుసగా హీరోలు ఎల్లమ్మ కథను రిజెక్ట్ చేయడంతో, దిల్ రాజు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న కథను మార్చాలని, కొంచెం కమర్షియల్ పాయింట్స్ యాడ్ చేయాలని బలగం వేణుకు దిల్ రాజు చెప్పాడట.
లైఫ్ ఇచ్చిన నిర్మాత. అందులోనూ ఇప్పుడు ఎల్లమ్మకు డబ్బులు పెట్టేది ఆయనే. అలాంటి వ్యక్తి మార్పులు సూచించిన తర్వాత… వేణు ఏం మాట్లాడకుండా మార్పులకు ఒకే చెప్పాడట. దీంతో ప్రస్తుతం ఎల్లమ్మ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయని సమాచారం అందుతుంది.
వేణు చేసింది ఒక్క సినిమే అయినా… ఆయన ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన కథ రాసినా.. స్క్రీన్ ప్లే రాసినా… గడ్డుగా నమ్మేసి… సినిమా తీసేయొచ్చు. కానీ, దిల్ రాజుతో సన్నిహిత్యం ఉన్న హీరోలు ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేస్తున్నారు అనే కారణంతో.. కథలు మార్పులు జరుగుతున్నాయనే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నిజంగా అలా జరిగితే మాత్రం.. ఎల్లమ్మ సోల్ మిస్ అయినట్టే.