KTR: సింగరేణి ఎన్నికల్లో ఓడిపోవడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన 10 హామీల్లో 8 మంది నెరవేర్చినా అలా ఎలా ఓడిపోయామో అర్థం కాలేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల్లో ఎవరూ సంతోషంగా లేరని కేటీఆర్ ఫైరయ్యారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం బాగుందని.. ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైందని రాష్ట్ర ప్రజలు చెబుతున్నారని.. ముఖ్యంగా రైతులు అస్సలు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు.
ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఓడిపోయాం..
ఎన్నికల ముందు హామీల జాతర ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టు కాంగ్రెస్ పాలన ఉందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆనాటి రోజులు తిరిగి తెస్తానని రేవంత్ నిజమే చెప్పాడు. రేవంత్ చెప్పి మరి నిజాయితీగా మోసం చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు పోయాం. తెలంగాణలో గోదావరి జలాలు సమృద్ధిగా దొరికే ప్రదేశం మెడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ అభివృద్ధి చెందడం వారికి నచ్చడం లేదు..
80 మీటర్ల నుంచి 600 అడుగుల దూరంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ కి 2 టీఎంసీల నీరు పంపింగ్ చేశారు. 21 పంప్ హౌస్ లు, 19 సబ్ స్టేషన్లు కట్టారు. 15 రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు, వేల కిలోమీటర్ల గ్రావిటీ కాళేశ్వరం. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఇలాంటి అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కేసీఆర్ పై సీబీఐ విచారణ పెట్టారు. సీబీఐ మోడీ జేబు సంస్థ అని రాహుల్ గాంధీ అంటారు. సీబీఐ మంచి సంస్థ అని ఇక్కడి సీఎం రేవంత్ అంటున్నారు. తెలంగాణ పచ్చబడటం కాంగ్రెస్, బీజేపీలకు నచ్చడం లేదు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: CM Revanth Reddy: కల్వకుంట్ల కుటుంబం కాలం చెల్లిన నోట్లలాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆగలేదు..
‘గుడ్లు పీకుతా, పేగులు మెడలేసుకుంటా అని విచిత్ర మాటలు సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ హయాంలో కరోనా వచ్చినప్పుడు ఆదాయం సున్నా ఉన్న సంక్షేమ పథకాలు ఆగలేదు. ఇప్పటి కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీకి మూటలు మోయడం, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికే సరిపోతుంది. కేంద్రం తెలంగాణ ప్రభుత్వ అప్పు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు అని కుండా బద్దలు కొట్టింది. కానీ కాంగ్రెస్ నేతలు నోటికి ఎంతోస్తే అంత చెబుతున్నారు. ఆరు గ్యారెంటీల నుంచి డైవర్షన్ కోసమే కాళేశ్వరం, ఈ ఫార్ములా కేసులు. ఖమ్మంలో గత మూడు పర్యాయాలుగా ఒకటే సీటు గెలుస్తున్నాం’ అని కేటీఆర్ తెలిపారు.
ALSO READ: Kavitha: బీఆర్ఎస్‌లో అవినీతి? ఆ బడా నేతల గుట్టు రట్టు చేసిన కవిత, త్వరలో మరికొందరి జాతకాలు?