Actress Geetha Singh at Big Tv Kissik Talks: నటి గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కితకితలు మూవీలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటించిన ఆమె ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. హీరోయిన్ గా లేడీ కమెడియన్‌గా అలరించిన ఆమె ఆ తర్వాత వెండితెరపై కనుమరుగైంది. అవకాశాలు లేకపోవడంతో నటనకు దూరమైంది. ఆ మధ్య తన కుమారుడు మరణంతో విషాదంలోకి వెళ్లింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్ షోలో పాల్గొంది. జబర్థస్త్ యాంకర్ వర్షిణి హో స్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో గీతా సింగ్ పాల్గొని తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది.
నన్ను తొలగించి వేరే అమ్మాయిని తీసుకున్నారు
ఈ సందర్భంగా సినిమాలకు దూరం అవ్వడం, కొడుకుని కోల్పోవడం వంటి విషయాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. అలాగే ఓ సారి షూటింగ్ లో సెట్‌లో తనకు ఎదురైన అవమానం గురించి పెదవి విప్పింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినా.. ఇక్కడ తెలుగు వాళ్లను గుర్తించరు.. తెలుగు రాకపోయినా.. ఎక్కడనుంచో తెచ్చుకుని వారికి ఆఫర్స్ ఇస్తారు. అలా ఓ సినిమాలో నన్ను తొలగించి.. నార్త్ నుంచి తెలుగు రాని అమ్మాయి తీసుకువచ్చి పెట్టారు. అది కూడా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నారు. ఆ సంఘటన నన్ను చాలా బాధించింది. తెలుగు వాళ్లే.. తెలుగు వాళ్లని పట్టించుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. ఎన్నో సినిమాల వస్తున్నాయి. కాస్తా మేమున్నామని కూడా గుర్తించండి’ అని గీతా సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది.
సెట్ లో అవమానించారు..
అలాగే ఓ షూటింగ్ సెట్‌లో తనకు ఎదురైన అవమానంను గుర్తు చేసుకుంది. “ఓ సినిమా షూటింగ్ మధ్య నేను నా హెయిర్ డ్రెస్సర్‌తో కలిసి క్యారవాన్ కి వెళ్లాను. అప్పుడు సెట్ లో ఒకటే క్యారవాన్ ఉంది. వాష్ రూం వాడేందుకు వెళ్లాను. అప్పుడు అక్కడే కొంతమంది ముంబై హీరోయిన్స్ ఉన్నారు. నన్ను చూసి ఏంటీ క్యారెక్టర్ ఆర్టిస్టు క్యారవాన్‌లోకి వెళుతుందని అవమానించారు. అది విన్న అల్లరి నరేష్ గారు.. నన్ను వారి దగ్గరికి తీసుకువెళ్లి.. ‘ఈమె నా హీరోయిన్.. తన వల్ల నాకు బ్రేక్ వచ్చింది’ అని చెప్పారు. అప్పటి నుంచి వారు నన్ను మేడం.. మేడం అని పిలవడం స్టార్ట్ చేశారు” అని చెప్పుకొచ్చారు. తన కొడుకు మరణం, రెండో పెళ్లి, రెండు సార్లు ఆత్మహత్యాయత్నం వంటి విషయాలను కూడా ఆమె షేర్ చేసుకుంది. మరిన్ని అవన్ని తెలియాలంటే.. ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా కితకితలు చిత్రంలో స్టార్ గా గుర్తింపు పొందిన గీతా సింగ్ ఎవడి గోల వాడిదే, సీమ టపాకాయ్, జంప్ జిలాని, ఈడోరకం.. ఆడోరకం వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పొందింది.