RBI to Banks: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులకు శుభవార్త చెప్పింది. ఇకపై పెద్ద నోట్లతో పాటు చిన్న నోట్లు కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు త్వరలో అమలులో తీసుకురావాలని బ్యాంక్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మనం తరచూ ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి ఏటీఎంలో పెద్ద నోట్లు మాత్రమే రావడం. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినప్పుడు ఎక్కువగా రూ.500, రూ.2,000 నోట్లు మాత్రమే వస్తాయి. దీనివల్ల అవసరాల కోసం చిన్న నోట్లు దొరకడం కష్టంగా మారుతుంది. బస్సులో ప్రయాణం చేయాలన్నా, ఆటోలో వెళ్లాలన్నా, షాపుల్లో కొనుగోలు చేయాలన్నా చిల్లర కోసం చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. చిల్లర లేదని చాలామంది దుకాణదారులు యూపీఐ ద్వారా చెల్లించమంటున్నారు. కానీ ప్రతిసారీ యూపీఐ సరిగ్గా పనిచేయదు. నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు రావడంతో ఆ సమయంలో చేతిలో చిల్లర లేక ప్రజలు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.
ఈ సమస్యను ఆర్బీఐ గుర్తించింది. అందుకే ఆర్బీఐ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై దేశంలోని అన్ని బ్యాంకులు తమ ఏటీఎంలలో తప్పనిసరిగా రూ.100, రూ.200 నోట్లను అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ ఆదేశించింది. అంటే, ఇకపై ఏటీఎంలో చిన్న నోట్ల కొరత ఉండకూడదని ఖచ్చితంగా చెప్పడం విశేషం. ఇది కేవలం ఆదేశం మాత్రమే కాదు.. అమలు చేయడానికి టైమ్ లిమిట్ కూడా పెట్టింది. సెప్టెంబర్ 30, 2025 నాటికి దేశంలోని కనీసం 75 శాతం ఏటీఎంలలో ఒక క్యాసెట్ మాత్రం తప్పనిసరిగా రూ100, రూ200 నోట్ల కోసమే ఉండాలని తెలిపింది. ఆ తర్వాత మార్చి 31, 2026 నాటికి 90 శాతం ఏటీఎంలలో చిన్న నోట్లు అందుబాటులో ఉండాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశం ప్రభుత్వ బ్యాంకులకు మాత్రమే కాదు ప్రైవేట్ బ్యాంకులు, అలాగే వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు కూడా వర్తిస్తుందని ప్రకటించింది.
Also Read: September 2025 Eclipses: సెప్టెంబర్‌లో రెండు గ్రహణాలు.. భారతదేశంలో ఎక్కడ కనపడతాయి?
వైట్ లేబుల్ ఏటీఎంలు అంటే
వైట్ లేబుల్ ఏటీఎంలు అంటే బ్యాంక్ పేరు లేకుండా, ప్రైవేట్ సంస్థలు నడిపే ఏటీఎంలు. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఏటీఎం ఉందో అక్కడ ఈ నిబంధన తప్పనిసరిగా అమల్లోకి రావలసి ఉంటుంది. చాలామందికి ఏటీఎంలలో చిన్న నోట్లు ఎందుకు దొరకడం లేదనే ప్రశ్న వస్తుంది. వాస్తవానికి ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు నింపడానికి అవసరమైన ప్రత్యేక బాక్స్‌లు ముందే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు బ్యాంకుల నిర్లక్ష్యం, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల చిన్న నోట్లు రావడం లేదు. ఆర్బీఐ ఈ సమస్యని గుర్తించి బ్యాంకులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి చిల్లర కోసం తిప్పలు పడాల్సిన అవసరం తగ్గిపోతుంది. రెండోది నగదు లావాదేవీలు సులభతరం అవుతాయి.
అవసరాలకు చిన్న నోట్ల కొరత
మరోవైపు బస్సు కండక్టర్‌కు టికెట్ డబ్బు ఇవ్వాలన్నా, టీ షాపులో టీ తాగాలన్నా, చిన్న చిన్న అవసరాల కోసం డబ్బులు చెల్లించాలన్నా ఏటీఎంలో లభించే రూ.100, రూ.200 నోట్లు చాలా సౌకర్యంగా మారతాయి. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు పెద్ద ఉపశమనమనే చెప్పాలి. ఇదే సమయంలో బ్యాంకులపై కూడా బాధ్యత పెరుగుతుంది. ఇకపై చిన్న నోట్లు ఆర్బీఐలలో లేకపోతే, అది ప్రజల నిర్లక్ష్యం కాదు, బ్యాంకుల నిర్లక్ష్యమే అవుతుంది. అందుకే ఈ నిర్ణయం వల్ల ఏటీఎంల నిర్వహణలో క్రమశిక్షణ పెరిగి ప్రజలకు ఉపయోగం చేకూరే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆర్బీఐ నిర్ణయం నిజంగానే సామాన్యుడి జీవితానికి ఊరట ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.