Chinmayi Karuppu: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా విడుదలైన ‘కరుప్పు’ సినిమాలో నటి త్రిష పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పే సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక ఆందోళనలను, గతంలో విజయ్ ‘లియో’ సినిమా సమయంలో జరిగిన వివాదాలను గుర్తుచేసుకుంటూ ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Read also-సీఎం విజయ్‌కు హీరో విశాల్ బహిరంగ లేఖ.. ఆ మూడు డిమాండ్లు ..
సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కరుప్పు’ చిత్రంలో త్రిష పాత్రకు చిన్మయి చెప్పిన డబ్బింగ్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఈ సినిమాకు తాను డబ్బింగ్ చెప్పిన విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి చాలా భయపడ్డానని చిన్మయి పేర్కొన్నారు. “ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పినట్లు బయటకు చెప్పడానికి నేను నిజంగా చాలా భయపడ్డాను. గతంలో ‘లియో’ సినిమా సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు, వివాదాలే అందుకు కారణం” అని ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.
దర్శకుడు ఆర్జే బాలాజీతో తనకు మంచి స్నేహబంధం ఉందని చిన్మయి తెలిపారు. అయితే, తనను ఈ సినిమాలో భాగం చేసినందుకు బాలాజీపై గానీ, ఆయన కుటుంబంపై గానీ ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు నెగిటివిటీని ప్రచారం చేస్తారేమోనని తాను తీవ్ర ఆందోళనకు గురైనట్లు ఆమె వెల్లడించారు. అంతేకాకుండా, స్టూడియోలో కొన్ని ఎమోషనల్ సీన్లకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనలు గుర్తొచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తనపై నమ్మకంతో త్రిష పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు ఆర్జే బాలాజీకి చిన్మయి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ఆంక్షలు, భయాలు లేకుండా తన సొంత పరిశ్రమలో స్వేచ్ఛగా పని చేసుకునే రోజులు రావాలని, అలాగే తనలాగే ఇండస్ట్రీలో నిషేధానికి గురైన ఇతరులకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Read also-బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సూర్య ‘కరుప్పు’.. సూర్య వైరల్ ట్వీట్స్!
2018లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీటూ’ ఉద్యమం సమయంలో, తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ తర్వాత సభ్యత్వ రుసుము చెల్లించలేదనే కారణాన్ని చూపిస్తూ డబ్బింగ్ యూనియన్ ఆమెపై నిషేధం విధించింది.
ఐదేళ్ల నిషేధం తర్వాత, 2023లో విజయ్-లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ సినిమాలో త్రిషకు డబ్బింగ్ చెప్పడం ద్వారా చిన్మయి మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో నిర్మాత లలిత్ కుమార్, లోకేష్ కనకరాజ్ ఆమెకు మద్దతుగా నిలిచి డబ్బింగ్ చెప్పించడంతో తమిళ చిత్ర పరిశ్రమలో అది పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ‘కరుప్పు’ సినిమాతో ఆమె మరోసారి త్రిషకు తన వాయిస్ అందించారు.