Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత మూడు రోజులుగా ఆయన నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇన్ని రోజులపాటు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్న నేపథ్యంలో సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు అయితే ఈ సినిమా విడుదలకు మూడు రోజుల సమయం ఉందన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. రెండు రోజుల నుంచి వరుసగా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడమే కాకుండా యూట్యూబర్స్ తో కూడా పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలు చేస్తూ సినిమాపై మంచి అంచనాలు పెంచేశారు.
సినిమా అంటే ఎడ్యుటైన్మెంట్..
ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన సినీ కెరియర్ లో వచ్చిన సినిమాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇకపోతే సినిమా అంటే ఇప్పటివరకు అందరికీ ఎంటర్టైన్మెంట్ అనేది మాత్రమే తెలుసు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాజాగా సినిమాకి సరికొత్త అర్థం చెప్పారు. తన దృష్టిలో సినిమా అంటే ఎడ్యుటైన్మెంట్ (edutainment)అంటూ చెప్పుకు వచ్చారు. ఎడ్యుకేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఈ రెండు కలిసి చేయగలిగినదే సినిమా అని చెప్పుకు వచ్చారు. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా అలాంటిదేనని పవన్ కళ్యాణ్ తెలియచేశారు.
తెలియని విషయాలు..
హరిహర వీరమల్లు సినిమా హిస్టారికల్ పిరియాడిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఎన్నో తెలియని విషయాలను ప్రేక్షకులు తెలుసుకుంటారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు అయితే కరోనా రావడం, ఈయన ఎన్నికల ప్రచారాలకు వెళ్లడం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం వంటి కారణాలతో సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వచ్చిది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పవన్ కూడా ప్రమోషన్లలో భాగమవుతున్నారు.
సీక్వెల్ పై క్లారిటీ…
ఇక ఈ సినిమా మొదట దర్శకుడుగా క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) వ్యవహరించారు అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో క్రిష్ కి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా సినిమా నుంచి తప్పుకున్నారు ఇలా ఈయన తప్పుకోవడంతో నిర్మాత ఎ.ఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా మారారు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు అయితే ఇప్పటికే రెండో భాగం దాదాపు 30% షూటింగ్ కూడా పూర్తి అయిందని ఇటీవల పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తనకున్న సమయం అలాగే వీరమల్లు సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనే విషయాలను దృష్టిలో పెట్టుకొని పార్ట్ 2 చేస్తామని పవన్ కళ్యాణ్ ఇటీవల సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Allahe Allaha -Tony Kick: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న టోనీ కిక్… ఆ సాంగ్ మీదనే సినిమా?