CM Revanth Reddy: ఉగాది కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, కింగ్ నాగార్జున, రష్మిక, నాగ చైతన్య వంటి వారెందరో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మిత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సహచర మంత్రి వర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, అక్కినేని నాగార్జున, అశ్వనీదత్, అల్లు అరవింద్, జయసుధ.. ఇంకా పాల్గొన్న సినీ ప్రముఖులు, సినీ అభిమానులకు పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సంబరాలను జరుపుకునే సందర్భంలో ప్రముఖ సినీ కళాకారులకు, యువ నటులకు, తెలంగాణ ప్రభుత్వం తరపున గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఇవ్వడమనేది మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించాం. సినీ పరిశ్రమను గుర్తించాలని తెలంగాణ రాష్ట్రం భావించింది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అంటే.. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి మాత్రమే గుర్తింపు కాదు.. దేశ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించబోతుంది, రాణించాలని చెప్పి.. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అదే విధంగా నాడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ, హైదరాబాద్ తరలి రావడానికి ఎన్టీఆర్, ఎఎన్నార్, రామానాయుడు, కృష్ణ.. ఈ నలుగురు, హైదరాబాద్‌లో ఉండే చార్మినార్‌కు నాలుగు మినార్‌లు ఎలానో తెలుగు సినీ పరిశ్రమకు ఈ నలుగురు ఒక మినార్‌లాగా పనిచేసి హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమ రావడానికి తీవ్రమైన కృషి చేశారు. వారితో పాటు ఈనాడు రామోజీ ఫిల్మ్ సిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రామోజీ రావు.. ఈ పరిశ్రమను శాశ్వతంగా హైదరాబాద్ నగరంలో వేళ్లూనుకునే విధంగా వారు తీవ్రమైన కృషి చేశారు. వారితో పాటు కార్మికుల కోసం పనిచేసిన సినీ ప్రముఖులను కూడా ఈ రోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభాకర రెడ్డి, దాసరి నారాయణరావు కార్మికుల కోసం ఎంతో చేశారు. ప్రభాకర రెడ్డి తన సొంత స్థలాన్ని సినీ కార్మికులు ఇళ్లు కట్టుకోవడం కోసం దానం చేశారు. కార్మిక బంధువుగా ఆయన నిలబడ్డారు. సినీ పరిశ్రమలో ఏ సంక్షోభం వచ్చినా, సమస్య వచ్చినా, సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణ రావు ఆ సమస్యలను పరిష్కరించి శాశ్వతంగా సినిమాను హైదరాబాద్ నగరంలో రాణించడానికి, తెలంగాణ రాష్ట్రం సినీ పరిశ్రమకు గుర్తింపు తేవడానికి వారు తీవ్రమైన కృషి చేశారు. వారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కమల్ హాసన్ ఇప్పుడే ఓ మాట చెప్పారు.. ఈ రోజు సినీ పరిశ్రమలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ అని కాకుండా పాన్ ఇండియా ఇండియన్ మూవీస్‌ని ఒక గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ సినిమా పరిశ్రమ అంటే, ఒకే గొడుగు కిందకు రావాల్సిన, ఒకే నగరం నుంచి ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కీ, పుష్ప..’ ఇలాంటి సినిమాలు జాతీయ స్థాయిలోనే సినిమా పరిశ్రమను ఒక పెద్ద ఇండస్ట్రీగా, కనకవర్షం కురిపించే పరిశ్రమగా ఈ రోజు సినీ పరిశ్రమలో ఉండే పెద్దలందరూ రాణించడానికి తీవ్రమైన కృషి చేశారు. అందుకే, ఈ రోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సినిమా ఇండస్ట్రీని.. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలను ఎలా అయితే గుర్తించామో, సినిమా ఇండస్ట్రీని కూడా అదే విధంగా గుర్తించి, ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం కాబట్టే.. ఆగిపోయిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని గద్దర్ అవార్డ్స్ పేరిట, పది సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న అవార్డ్స్‌ను గత సంవత్సరం ప్రారంభించాం. ఇప్పుడు రెండో సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఖుష్బూ, జయసుధ వంటి వారంతా రావడం, ఈ రోజు అవార్డ్స్‌ను సొంతం చేసుకున్న నాగ చైతన్య, రష్మిక వంటి యంగ్ స్టర్స్‌కు అవార్డ్స్ ఇచ్చేందుకు సీనియర్స్ అందరూ వచ్చి, వారి భుజం తట్టి ప్రోత్సహించినందుకు వారందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.