CM Revanth on Tollywood :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా నిర్మాతలకు, సినీ కార్మికులకు మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 30% వేతనం పెంచాలని అటు సినీ కార్మికులు.. అసలే నష్టాల్లో ఉన్న మేము ఇప్పుడు ఆ రేంజ్ లో వేతనం పెంచలేమని నిర్మాతలు.. ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ విషయంపై ఎన్నో సమావేశాలు, చర్చలు జరిగాయి. కానీ సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. ఇక ఎట్టకేలకు ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.
నిర్మాతలు – సినీ కార్మికుల ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న నిర్మాతలు సినీ కార్మికుల ఇష్యూపై స్పందించారు. సినీ కార్మికులు నిర్మాతలతో మాట్లాడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా ఈ ఇరువర్గాల మధ్య ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలని కూడా సూచించారు రేవంత్ రెడ్డి. ఇక సీఎం ఆదేశాలతో సినీ కార్మికులతో డీజీపీ భేటీ అవడం జరిగింది. మరి సీఎం సలహా మేరకు రంగంలోకి దిగిన అధికారులు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
16 రోజులుగా కొనసాగుతున్న సమ్మె..
ఇక పూర్తి వివరాల్లో విషయానికి వస్తే.. గత 16 రోజులుగా సినీ కార్మికులు సమ్మె జరుగుతోంది. కార్మికులు స్ట్రైక్ చేయడంతో షూటింగ్స్ దాదాపు బంద్ అయిపోయాయి.. అటు టాలీవుడ్ పరిశ్రమ కూడా స్తంభించిపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోలను మొదలుకొని జూనియర్ హీరోల సినిమాల వరకూ షూటింగ్ లు కూడా దాదాపు ఆగిపోయాయి. కార్మికుల సమ్మె కారణంగా అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ అవుతాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి..
షరతులతో కూడిన లేఖ రాసిన ఫిలిం ఛాంబర్..
ఇదిలా ఉండగా కార్మికుల వేతనాల పెంపుపై ఫిలిం ఫెడరేషన్ కి ఫిలిం ఛాంబర్ లేఖ కూడా రాసింది. నాలుగు షరతులు, పర్సంటేజీ విధానాన్ని దానిలో వివరించింది కూడా.. మరొకవైపు సినిమాకు సంబంధించిన 24 సంఘాలతో ఫిలిం ఫెడరేషన్ సమావేశం అయ్యింది. ఇకపోతే ఫిలిం ఛాంబర్ పెట్టిన షరతుల విషయానికొస్తే.. ఉదయం 9 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు కాల్ చేయుటను 12 రెగ్యులర్ పనిగంటలుగా పరిగణించాలి. రెండో ఆదివారం కార్మిక శాఖ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించే వీలుంటుంది. 2022 జూలైలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. డాన్సర్స్, రైటర్స్ కోసం రేషియోలను 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయడం లేదు. అది తప్పనిసరిగా ఇవ్వాలి.
షరతులు ఒప్పుకుంటే షూటింగ్ షురూ..
అదే ఒప్పందంలో జనరల్ కండిషన్ క్లాస్ 1 ప్రకారం నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తి అయినా తన సినిమా కోసం ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉంటుంది. షరతులను అంగీకరిస్తే.. రోజుకు రూ.2000.. అంతకంటే తక్కువ సంపాదించే కార్మికుల వేతనాలను వెంటనే 10% పెంచడానికి తదుపరి ఏడాది నుండి అదనంగా 5%.. ఆ తర్వాత సంవత్సరం మరో ఐదు శాతం పెంచేందుకు నిర్మాతలు ప్రతిపాదించారు. దాదాపు రోజుకు 2000 నుండి 5వేల లోపు సంపాదించే కార్మికులకు వరుసగా మూడేళ్లపాటు ఐదు శాతం వేతన పెంపును నిర్ణయించారు. ఇక తక్కువ బడ్జెట్ చిత్రాల విషయంలో ప్రస్తుత వేతనాలే అమలు ఉంటాయని పెంపు వర్తించదు అని కూడా తమ లేఖలో స్పష్టం చేశారు నిర్మాతలు. ఇక ఇప్పుడు నిర్మాతలు పెట్టిన షరతులకు కార్మికుల సంఘం ఒప్పుకుంటుందా? లేదా? అనే విషయంపై ప్రస్తుత రావాల్సి ఉంది. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సలహా మేరకు మరి రెండు రోజుల్లో సమస్య సాల్వ్ అవుతుందని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?