Indian Railways: కేంద్రానికి ఆదాయం వచ్చేవాటిలో రైల్వేశాఖ ఒకటి. ఎందుకంటే దేశంలో ఏ ప్రాంతానికైనా రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఒక్క పైసా పెంచితే ఏడాదికి కోట్లలో ఆదాయం ఆ శాఖకు వస్తోంది. నేరుగా టికెట్లపై కాకుండా దొడ్డి దారిన ప్రయాణికులపై వడ్డించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇంతకీ రైల్వే శాఖ దేనిపై దృష్టి పెట్టింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
రైల్వే ప్రయాణికులకు కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది ఆ శాఖ. లగేజీ బరువుపై ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు లేవు. ఇకపై విమానాశ్రయాల తరహాలో రైల్వేలో చర్యలు చేపట్టాలని భావిస్తోంది. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లే వారి నుంచి అదనపు రుసుము, లేదా జరిమానా వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
దీని ప్రకారం దేశంలోని రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రానిక్ వెయిట్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లే ముందే తమ లగేజీ బరువును కచ్చితంగా వెయిట్ చెక్ చేసుకోవాలి. పరిమితికి మించి బరువు ఉంటే ప్రయాణికులపై అదనపు భారం పడనుంది.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రయాణికులను రైలులోకి ఎక్కేందుకు అనుమతి ఇస్తారు. ఆ లెక్కన ప్రయాణికులు స్టేషన్‌కు ముందుగా రావాల్సి వుంటుందన్నమాట. రైల్వే శాఖ ప్రతిపాదనల ప్రకారం.. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 70 కేజీలు, ఏసీ 2-టైర్ ప్రయాణికులు 50 కేజీల ఉచితంగా లగేజీ తీసుకెళ్లవచ్చు.
ALSO READ: డ్రైవర్ లెస్ కారులో రైడింగ్.. అవాక్కయిన ఇండియన్ పేరెంట్స్
3-టైర్ ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు 40 కిలోల వరకు మాత్రమే. జనరల్ బోగీలలో ప్రయాణించే వారికి 35 కిలోల పరిమితి చేయాలని భావిస్తోంది. కొత్త నిబంధనలను తొలుత ఉత్తర మధ్య రైల్వే జోన్ పరిధిలో అమలు చేయాలన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది.
ఎంపిక చేసిన 11 స్టేషన్లలో కొత్త లగేజీ నిబంధనలు అమలు చేస్తారట. వాటిలో ఈ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో లక్నో చార్‌బాగ్ రైల్వే స్టేషన్, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, కాన్పూర్ సెంట్రల్, బనారస్, మీర్జాపూర్, తుండ్ల, అలీఘర్, ఎటావా స్టేషన్లు ఉన్నాయి. అమలు చేయాల్సిన అదనపు ఛార్జీలపై రైల్వేశాఖ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ప్రతి అదనపు కేజీకి అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖచ్చితమైన ఫీజులపై త్వరలో ప్రకటన రానుంది. అన్నట్లు ఈ మధ్య చాలా రైల్వేస్టేషన్లను ఆ శాఖ కొత్తగా పునర్నిర్మాణం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ భారాన్ని ప్రయాణికులపై వడ్డించాలని భావిస్తున్నట్లు కొందరి అధికారుల మాట.
దీనివల్ల మధ్య, దిగువస్థాయి ప్రజలపై ఎక్కువ భారం పడుతుందని అంటున్నారు. లగేజీలు ఎక్కువగా తీసుకెళ్లేది ఆయా వర్గాలు మాత్రమేనని అంటున్నారు. ఈ విషయంలో ఏసీ ప్రయాణికులకు పెద్దగా భారం పెరగకపోవచ్చనే వాదన లేకపోలేదు. ఉత్తర మధ్య రైల్వే జోన్ సక్సెస్ అయితే ఆ తర్వాత మిగతా జోన్‌లకు విస్తరించాలనే ఆలోచనగా చెబుతున్నారు అధికారులు.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం రకరకాలు ప్రయోగాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఆధునీకరించిన స్టేషన్లలో సింగిల్-బ్రాండ్ స్టోర్లను ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది. వాటిలో దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రయాణాలకు ఉపయోగించే బ్రాండ్ వస్తువులు లభించనున్నాయి.