CM Vijay:సినీ బ్యాక్ గ్రౌండ్ తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, సినీ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న విజయ్ దళపతి.. 2026 తమిళనాడు సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఏకంగా తమిళనాడుకే ముఖ్యమంత్రిగా అవతరించి, అందరి దృష్టిని ఆకర్షించారు. తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడమే కాకుండా తమిళనాడు రాష్ట్రంలో పలు మార్పులు తీసుకొస్తూ.. కొత్త పథకాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలాంటి విజయ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. కారణం ఆయన ఇంట విషాదం చోటు చేసుకుంది.
సినీ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్దమ్మ అమల్ రాజశేఖరన్ (Amal Rajasekharan) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ.. ఒక వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 92 సంవత్సరాలు. విజయ్ తండ్రి చంద్రశేఖరన్ సోదరుడు రాజశేఖరన్ భార్య అమల్ రాజశేఖరన్. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ముగ్గురు కూడా విదేశాలలో స్థిరపడడంతో ఆమె వృద్ధాశ్రమంలోనే నివసిస్తున్నట్లు సమాచారం. ఇక వయోభారంతో పాటు వృద్ధాప్య సమస్యలు కూడా ఆమెను చుట్టుముట్టడంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.ఈ ఘటనతో విజయ్ కుటుంబంలో విషాదం నెలకొంది.
అమల్ రాజశేఖరన్ మరణ వార్త తెలియడంతో తన తల్లిదండ్రులతో కలిసి సీఎం విజయ్ తన పెద్దమ్మ అమల్ రాజశేఖరన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు కూడా అక్కడికి చేరుకొని ఆమె పార్తివదేహానికి నివాళులర్పించారు. ఇక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ కుటుంబంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన పలువురిని కలిచివేసింది. 92 ఏళ్ల జీవితాన్ని పూర్తి చేసుకున్న అమల్ రాజశేఖరన్ మృతి పట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:ఇరుముడి మూవీ టీమ్ కి షాక్.. కార్మికశాఖ నోటీసులు!
అమల్ రాజశేఖరన్ వృద్ధాశ్రమంలో జీవిస్తూ అక్కడే మృతి చెందారు అన్న వార్త బయటకు రావడంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంచి హోదాలో ఉన్న పిల్లలు తల్లిని చూసుకోకుండా వృద్ధాశ్రమంలో విడిచిపెట్టడం ఏంటి? అంటూ విమర్శలు గుప్పిస్తుంటే .. మరికొంతమంది ఏ కారణాల చేత ఆమె వృద్ధాశ్రమంలో ఉన్నారో తెలియదు కదా.. అనవసరంగా వారిపై నిందలు వేయడం ఎందుకు అంటూ ఇలా ఎవరికి తోచినట్లు వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అమల్ రాజశేఖరన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ.. ఆమె కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.