Vineesh Darshan: కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన రేణుకాస్వామి హత్య కేసులో స్టార్ హీరో దర్శన్ తూగుదీప జైలు గోడల మధ్యే గడుపుతున్నాడు.ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు ప్రస్తుతం చాలా దూరంగా కనిపిస్తుండటంతో, ‘ఛాలెంజింగ్ స్టార్’ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ‘కాటేరా’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శన్, గతేడాది కాలంగా చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకుని జైలులోనే ఉండిపోయారు. ఆయన కెరీర్ గ్రాఫ్ ఇలా పడిపోతున్న తరుణంలో, ఇప్పుడు దర్శన్ కుటుంబం మరో చిక్కుల్లో ఇరుక్కుంది . ఈసారి ఆయన కుమారుడు వినీష్ తూగుదీప సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల టార్గెట్ అయిపోయాడు.
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్‌ఆర్ నగర్) ప్రధాన రహదారిపై ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదం దీనికంతటికీ కారణమైంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఒక ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ కారు, ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కారును చుట్టుముట్టడం, కారులో ఉన్నవారితో తీవ్రమైన వాగ్వాదానికి దిగడం క్షణాల్లో జరిగిపోయాయి. అయితే, ఆ లగ్జరీ కారు దర్శన్ కుమారుడు వినీష్‌దేనని, ఆ సమయంలో అతడే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమయ్యాడంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతటితో ఆగకుండా, ఈ ప్రమాదంలో వినీష్‌కి తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడంటూ కొన్ని వెబ్‌సైట్లు కథనాలను కూడా అల్లేశాయి.
దర్శన్ జైలుకు వెళ్లినప్పటి నుంచి మానసిక వేదన అనుభవిస్తున్న ఆయన భార్య విజయలక్ష్మి, తమ కుమారుడిపై వస్తున్న ఈ భయంకరమైన పుకార్లను చూసి తీవ్రంగా స్పందించారు. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలను పూర్తిగా ఖండిస్తూ ఆమె ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. వినీష్ పూర్తిగా క్షేమంగా ఉన్నాడని, అతనికి ఎలాంటి గాయాలు కాలేదని, ఆస్పత్రిలో చేరారనేది కేవలం ఒక పుకారు మాత్రమేనని కొట్టిపారేశారు.
Also read :షారుఖ్‌కు లైవ్ లోనే ఓపెన్ ప్రపోజల్.. ‘బాద్‌షా’ మైండ్ బ్లోయింగ్ పంచ్!
ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజాన్ని విజయలక్ష్మి వివరిస్తూ, “ప్రమాదం జరిగిన సమయంలో వినీష్ కారు నడపడం లేదు. మా డ్రైవర్ స్టీరింగ్ మీద ఉన్నాడు. బెంగళూరు ట్రాఫిక్‌లో సాధారణంగా జరిగే చిన్నపాటి ఘర్షణే ఇది. నిజానికి బైక్ నడుపుతున్న వ్యక్తి వల్లే ఈ తప్పిదం జరిగింది. సదరు బైకర్ కూడా తన తప్పును అంగీకరించి మా డ్రైవర్‌కు, వినీష్‌కు క్షమాపణలు కూడా చెప్పాడు” అని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత బైక్‌పై ఉన్నవారు సురక్షితంగా ఉన్నారో లేదో మానవత్వంతో తెలుసుకోవడానికి మాత్రమే వినీష్ కారు దిగి వారి వద్దకు వెళ్లాడని, కానీ కొందరు కావాలనే ఆ విజువల్స్‌ను నెగిటివ్‌గా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ఇప్పటికే తమ కుటుంబం అనుభవిస్తున్న నరకయాతన చాలదన్నట్టు, ఇలాంటి తప్పుడు వార్తలు తమను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వార్తలను ప్రసారం చేయాలని కోరారు. అలాగే అభిమానులు, సామాన్య ప్రజలు కూడా ఇలాంటి సెన్సేషనల్ రూమర్లను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేసి పుకార్లను పెంచవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. దర్శన్ నటించిన ‘కురుక్షేత్ర’, ‘క్రాంతి’ వంటి సినిమాలు ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే.
Also read :విజయ్ దేవరకొండ ‘రణబాలి’ చుట్టూ వివాదాలు.. లీగల్ యాక్షన్‌కు రెడీ అయిన రౌడీ టీమ్!