Dil Raju: నేడు అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం కావడంతో హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో యాంటీ డ్రగ్స్(Anti Drugs) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) తో పాటు నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చదిద్దాలన్న ధ్యేయంతో రేవంత్ రెడ్డి ఇప్పటికే సినీ సెలబ్రిటీలకు కీలక సూచనలు చేశారు. వారి సినిమా విడుదలకు ముందు కొన్ని నిమిషాల పాటు డ్రగ్స్ గురించి అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేలా హీరోలను ప్రోత్సహించమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలోని నటీనటులకు తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేయడం కోసం ఎంతో కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈయన అధికారులను కోరారు. అదేవిధంగా ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ వాడినట్టు తెలిస్తే మాత్రం వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ చేస్తామని నటీనటులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ…
మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్న నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ చేస్తున్నారు. అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేసే విధంగా టిడిఎఫ్సి ద్వారా చర్చలు జరుపుతామని దిల్ రాజు తెలిపారు. ఇదే విషయం గురించి తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తో సంప్రదింపులు జరిపి అధికారిక నిర్ణయం తీసుకుంటామని దిల్ రాజు తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం అంటూ ఈ కార్యక్రమంలో అందరూ ప్రతిజ్ఞ కూడా చేశారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రం…
ఇలా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎంతో ప్రశంసించదగినదని చెప్పాలి. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు పూర్తిగా ఇలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ వాడకం పెరిగిపోతుంది. ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ వాడకాన్ని కట్టడి చేయడం కోసమే ఫిలిం ఛాంబర్ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు విచారణలకు కూడా హాజరైన విషయం తెలిసిందే.