Rangareddy: రంగారెడ్డి జిల్లా బాట సింగారం వద్ద భారీ ఎత్తున గంజాయిని రాచకొండ పోలీసులు సీజ్ చేశారు. సుమారు 1000 కిలోల గంజాయిని ఈగల్ టీమ్ తో కలిసి స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో దీని విలువ అక్షరాలా 5 కోట్ల రూపాయలు. ఈ స్థాయిలో గంజాయి పట్టుబడడంతో అధికారులు షాక్ అయ్యారు. ఎలా పట్టుబడ్డారు? ఎక్కడ నుంచి వస్తోంది? ఎక్కడకు వెళ్తోంది? అనేది ఆసక్తికరంగా మారింది.
గంజాయికి ఒకప్పుడు కేరాఫ్‌గా ఏపీ ఉండేది. అక్కడ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో స్మగ్లర్ల దృష్టి ఒడిషాపై పడింది. వ్యవసాయం కంటే కొండ ప్రాంతాల్లో భారీ ఎత్తున గంజాయి సాగు చేస్తున్నారు. ఒడిషా నుంచి ఏపీ, తెలంగాణ మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు ముఠాలు. కొన్నాళ్లుగా గంజాయి ముఠా కదలికలపై ఆరా తీసిన ఈగల్ టీమ్స్, ప్రత్యేకంగా నిఘా వేశాయి.
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గంజాయిపై నిఘా పెట్టడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఒడిషా నుంచి మహారాష్ట్రకు డీసీఎం వాహనంలో 935 కిలోల గంజాయిని తరలిస్తోంది ఓ గ్యాంగ్. ముందస్తు సమాచారంతో రాచకొండ పోలీసులు, ఈగల్ టీమ్‌తో కలిసి నిఘా పెట్టారు. రంగారెడ్డి హైవేపై ప్రతీ వాహనాన్ని చెక్ చేయడం మొదలుపెట్టారు.
ఇన్నోవా కారు డీసీఎం వాహనానికి ఎస్కార్టుగా బయలుదేరింది. బాట సింగారం వద్దకు రాగానే కారుతోపాటు డీసీఎం వాహనాన్ని పట్టుకున్నారు. 935 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గంజాయిని 455 ప్యాకెట్లుగా చేసి పండ్ల ట్రేల మధ్యలో పెట్టి తరలిస్తోంది ఓ ముఠా.
ALSO READ: ప్రైవేటు మెడికల్ కాలేజీలపై విజిలెన్స్ ఎంక్వైరీ
ముగ్గుర్ని అరెస్టు చేసింది ఈగల్ టీమ్. వీరంతా అంతరాష్ట్ర నిందితులు. పవార్ కుమార్ బాడు అనేవారు గంజాయి ముఠాకి సారధిగా వ్యవహరిస్తున్నాడు. సమాధాన్ భిస్, వినాయక్ పవార్ అరెస్ట్ చేశారు. వినాయక్ అనేవాడు ఇన్నోవా వాహనం నడుపుతూ వెనుక వస్తున్న డీసీఎం వాహనాన్ని గైడ్ చేస్తూ ఉంటాడు.
ఆరు మొబైల్స్, కారు, డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. సప్లయర్స్ సచిన్ గంగారాం చౌచౌహాన్, విక్కీ సేథ్‌లు పరారీలో ఉన్నారు. ఖమ్మంకు చెందిన ఈగల్ టీమ్ గంజాయిపై నిఘా పెట్టింది. చివరకు విజయవాడ-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఈ గ్యాంగ్ వస్తున్నట్లు తెలుసుకుని పక్కాగా ప్లాన్ బాటసింగారం వద్ద వారిని అదుపులోకి తీసుకుంది.